* జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు
* క్షేత్ర స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాచరణ
Revenue Meetings: ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడం, భూ సంబంధిత సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమీక్షలు కేవలం అధికారిక సమావేశాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను నిర్దేశించే విధంగా కొనసాగనున్నాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల సమీక్షలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడంతో పాటు, దూర ప్రాంత జిల్లాలకు మంత్రి స్వయంగా వెళ్లి అక్కడే సమీక్షలు నిర్వహించనున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లతో సహా సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమీక్షల్లో పాల్గొంటారు.
ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా సమీక్షల్లో భాగస్వాములను చేసి.. ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, స్థానిక అవసరాలు, పరిష్కరించాల్సిన అంశాలను నేరుగా తెలుసుకునే విధంగా మంత్రి పొంగులేటి ఈ సమీక్షలను నిర్వహించనున్నారు
హౌసింగ్ అమలుపైనా సమీక్ష
రెవెన్యూ అంశాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణ పురోగతి, స్థలాల సమస్యలు తదితర అంశాలను కూడా జిల్లా సమీక్షల్లో మంత్రి పరిశీలించనున్నారు.
మొదటి సమీక్ష జగిత్యాలలో
జిల్లాల వారీగా చేపట్టనున్న సమీక్షల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షను జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు.


