డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించే తప్పుడు కంటెంట్ దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికల్లో వినియోగదారులను మోసపూరిత కంటెంట్ నుంచి రక్షించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఇకపై దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ప్రతి కంటెంట్‌కు AI కంటెంట్ లేబులింగ్ తప్పనిసరి కానుంది. అంటే సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే ఫొటో, వీడియో, ఆడియో లేదా ఇతర కంటెంట్ నిజంగా మనుషులు రూపొందించిందా, లేక ఏఐ సాంకేతికతతో సృష్టించబడిందా అనే విషయాన్ని వినియోగదారులు స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, తప్పుడు సమాచార ప్రచారం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులపేరుతో తప్పుడు వీడియోలు వైరల్ అవుతూ అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. వాటిని అరికట్టడమే ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాదు, సోషల్ మీడియా సంస్థలపై కూడా ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాల మేరకు చట్టవిరుద్ధమైన, డీప్‌ఫేక్ లేదా హానికరమైన ఏఐ కంటెంట్‌ను తొలగించేందుకు ఇప్పటివరకు ఉన్న 36 గంటల గడువును కేవలం 3 గంటలకు తగ్గించింది. ఫలితంగా ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా సెన్సిటివ్ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార గడువును 24 గంటల నుంచి 2 గంటలకు, ఇతర సాధారణ ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 72 గంటల నుంచి 36 గంటలకు కుదించారు. దీంతో డిజిటల్ వేదికల్లో పారదర్శకత పెరగడంతో పాటు, వినియోగదారుల భద్రతకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.












