మళ్లీ పసిడి పరుగులు
1.5 లక్షల దిశగా తులం బంగారం
త్వరలోనే రూ. 2 లక్షలవుతుందంటున్న ఎక్స్‌పర్ట్స్
డబ్బులుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం బెటరేనా..?
ఒకప్పుడు బంగారం అంటే కేవలం ఆభరణం. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ అవసరాల కోసం మాత్రమే కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంగారం ఒక అంతర్జాతీయ పెట్టుబడి సాధనంగా మారింది. స్టాక్ మార్కెట్ పడిపోయినా, ప్రపంచంలో యుద్ధాలు మొదలైనా, ఆర్థిక మాంద్యం భయాలు పెరిగినా, ద్రవ్యోల్బణం పెరిగినా... పెట్టుబడిదారులు ముందుగా ఆశ్రయించే ఆస్తి బంగారమే. అందుకే గత కొన్నేళ్లుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకుంటుందా?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా బంగారం ధరల ప్రయాణాన్ని ఒకసారి పరిశీలించాలి. 2020 కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఆ సమయంలో భారత మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం తొలిసారిగా రూ.50 వేల స్థాయిని దాటింది. ప్రపంచ దేశాలు భారీగా డబ్బు ముద్రించడం, వడ్డీ రేట్లు తగ్గించడం, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం వెతకడం వంటి కారణాలతో బంగారం ధరలు వేగంగా పెరిగాయి.
అయితే రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు చేరుకోవడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. కరోనా తర్వాత కూడా ప్రపంచ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వంటి అంశాలు ధరలను మరింత పెంచాయి. చివరకు 2025లో భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది.
అసలు ఆశ్చర్యం ఆ తర్వాతే కనిపించింది. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు వెళ్లడానికి ఐదేళ్లు పట్టిన బంగారం... రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు చేరుకోవడానికి మాత్రం ఏడాదిలోపే సరిపోయింది. అంటే బంగారం పెరుగుదల వేగం మరింత పెరిగిందని అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారాన్ని "సేఫ్ హెవెన్ అసెట్"గా ఎక్కువగా కొనడం దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకే దిశలో పెరగవు. మధ్య మధ్యలో గణనీయమైన తగ్గుదల కూడా కనిపిస్తుంది. గత కొన్ని వారాల్లో కూడా బంగారం ధరలు కొంత మేర తగ్గాయి. దీనికి ప్రధాన కారణం లాభాల స్వీకరణ. రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత పెద్ద పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి లాభాలు తీసుకున్నారు. అలాగే అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్లు ఎక్కువకాలం కొనసాగవచ్చనే అంచనాలు కూడా ధరలపై ప్రభావం చూపాయి.
మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్
మరో కీలక అంశం మిడిల్ ఈస్ట్ పరిస్థితులు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, గాజా యుద్ధం, రెడ్‌సీ ప్రాంతంలో భద్రతా సమస్యలు, చమురు సరఫరాపై ఆందోళనలు... ఇవన్నీ వచ్చినప్పుడల్లా ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం వైపు పరుగులు తీశారు. దీంతో ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అయితే యుద్ధ పరిస్థితులు కొంత సద్దుమణిగాయనే సంకేతాలు వచ్చినా, కాల్పుల విరమణపై ఆశలు పెరిగినా, దౌత్య చర్చలు ప్రారంభమైనా... అదే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా తగ్గుదల కనిపించింది. అంటే ప్రస్తుతం బంగారం ధరల్లో కనిపిస్తున్న ఒడిదుడుకులకు మిడిల్ ఈస్ట్ పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక మరో అంశం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు. అమెరికా డాలర్‌పై ఆధారపడకుండా ఉండేందుకు చైనా, భారత్ సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు గత కొన్నేళ్లుగా భారీగా బంగారం నిల్వలు పెంచుతున్నాయి. ఈ డిమాండ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. మరోవైపు రూపాయి బలహీనపడితే భారత మార్కెట్లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ కంటే మరింత వేగంగా పెరుగుతాయి. ఎందుకంటే మన దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.
డబుల్ సెంచరీ ఎప్పుడు..?
అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే... రూ.2 లక్షల మార్కు. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు దీర్ఘకాలంలో బంగారం పరుగులు బలంగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. కానీ రూ.2 లక్షల మార్కుకు ఎప్పుడు చేరుతుందో మాత్రం ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అది వచ్చే నెలలో కూడా రావచ్చు... లేక రెండేళ్లు, మూడేళ్లు కూడా పట్టొచ్చు. అంతా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, డాలర్ బలం, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు బంగారం కొనాలా లేదా అనే ప్రశ్నకు కూడా ఒకే సమాధానం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే విడతలవారీగా కొనడం మంచిది. ధరలు తగ్గినప్పుడు మరికొంత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సగటు కొనుగోలు ధర కూడా తగ్గుతుంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడిగా భావించే వారికి ఈ విధానం మరింత అనుకూలంగా ఉంటుంది.
ఒకప్పుడు రూ.50 వేల బంగారం చాలా ఖరీదని అనుకున్నారు. ఆ తర్వాత రూ.1 లక్ష అసాధ్యమని భావించారు. కానీ మార్కెట్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిని కూడా చూసింది. అందుకే రూ.2 లక్షల లక్ష్యం అసాధ్యం అని చెప్పలేం.












