ఏపీ

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. వర్షాకాల అసెంబ్లీకి ముహూర్తం ఖరారు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని కీలక సామాజిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మూడున్నర గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, విద్య, పారిశ్రామిక రంగాలతో పాటు పలు చట్టపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదాలు తెలిపింది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ.1,002.49 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించేందుకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ భవనాల డిజైన్ల పూర్తి కోసం అదనపు నిధుల కేటాయింపునకు అంగీకారం తెలిపింది. అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ఆమోదించడంతో పాటు, అమరావతి ఐ ప్రాజెక్టుకు రీ-టెండర్లు పిలవాలని నిర్ణయించింది.

పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడంపై కూడా కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్–2026', 'ఏపీ పీపీపీ పాలసీ–2026' ముసాయిదాలకు ఆమోదం తెలిపింది. రోడ్డు భద్రత కోసం 'పాదచారుల భద్రత పాలసీ–2026', విశాఖపట్నంలోని మురికివాడల సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ భూముల లీజు గడువును పెంచే చట్ట సవరణలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆమోదం తెలిపింది.

న్యాయపరమైన సంస్కరణల్లో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా బిల్లు–2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు–2024లను ఉపసంహరించుకుని వాటి స్థానంలో ప్రజల భద్రత, భూముల రక్షణకు మరింత సమర్థవంతమైన కొత్త చట్టాలను తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే పారిశ్రామికాభివృద్ధి కోసం టెక్స్‌టైల్స్ పాలసీలో వేతన సబ్సిడీ నిబంధనలకు సవరణలు చేసింది. కొత్త పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులు ఇచ్చింది.

మొబైల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూముల కేటాయింపు, రాయితీ విద్యుత్ సరఫరాకు కూడా ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అవసరాల కోసం భూములు కొనుగోలు చేయాలని ఏపీఐఐసీకి సూచించింది. తీవ్ర నష్టాల్లో ఉన్న మూడు సహకార చక్కెర కర్మాగారాలను లిక్విడేషన్ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా విద్యా రంగంలో రెండు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్, కొత్త జిల్లాల్లో విద్యా పరిపాలనను బలోపేతం చేసేందుకు 15 కొత్త డీఈఓ పోస్టులను సృష్టించాలని నిర్ణయించింది.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం రూ.210.06 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసింది. ఇక రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని కీలక సామాజిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.

#Andhra Pradesh#Cabinet#meeting#finalized#monsoon session#Assembly
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి