ప్రభుత్వాలు ఎన్ని మారిన.. సంస్కరణలు ఎన్ని చేపట్టిన మారని రాతలు మధ్యతరగతి జీవితాలవి. వారికి వైద్య, విద్య వంటి కనీస అవసరాలు ఎప్పుడు అందనంత దూరంలోనే ఉంటాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దాసుపత్రి వైద్యం.. కార్పొరేట్ స్థాయి విద్య పొందాలంటే పేద, మధ్యతరగతి వాడికి ఈ జీవితం సరిపోదు.. ఈ నేపథ్యంలో ఓ భారతీయుడు వైద్య సాంకేతిక రంగంలో అద్భుత ఆవిష్కరణ చేశాడు..
విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ భారతదేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ స్కాన్ మెషిన్ అందుబాటులోకి తీసుకు వచ్చాడు. న్యూయార్క్‌లోని జీఈ కార్పొరేట్ సంస్థలో హై శాలరీ తీసుకుంటున్న భారతీయ ఇంజినీర్ డాక్టర్ అర్జున్ అరుణాచలం.. పేదలకు ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు వచ్చారు.
అనంతరం సుమారు 12 ఏళ్ల పాటు నిరంతర పరిశోధనలు చేసి, పూర్తిగా భారత్‌లోనే తక్కువ బరువుతో ఉన్న MRI మెషీన్‌ను తయారు చేశారు. మరోవైపు సాధారణంగా ఆస్పత్రుల్లో వాడే ఎంఆర్ఐ మెషిన్లు 5 టన్నుల బరువు ఉంటాయి. కాగా మెషిన్లు చల్లబరచడానికి ఖరీదైన లిక్విడ్ హీలియంను ఉపయోగిస్తాయి. కానీ ఇండియాలో తయారైన ఈ పరికరానికి లిక్విడ్ హీలియం అవసరం లేదు. పైగా బరువు కూడా సగానికి తగ్గడం వల్ల చిన్న క్లినిక్స్‌లలో కూడా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు..
మరోవైపు, ఈ స్వదేశీ ఎంఆర్ఐ మెషిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఐ స్కాన్ ఖర్చులతో పోలిస్తే, స్కానింగ్ వ్యయం దాదాపు 60 శాతం వరకు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ సాంకేతికతను సొంతం చేసుకునేందుకు పలు అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు ముందుకొచ్చినా, భారతదేశానికే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ అర్జున్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.
ఈ ప్రాజెక్టుకు టాటా ట్రస్ట్స్‌తో పాటు జోహో సంస్థ అధినేత శ్రీధర్ వేంబు రూ.35 కోట్ల పెట్టుబడితో అండగా నిలిచారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని ఒక క్యాన్సర్ కేర్ సెంటర్‌లో ఈ స్వదేశీ ఎంఆర్ఐ మెషిన్ విజయవంతంగా సేవలందిస్తోంది. త్వరలోనే ఉత్పత్తిని విస్తరించి దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి.












