తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులకు ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ సెలవులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు వరుసగా పాఠశాలలకు విరామం లభించే అవకాశం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 8వ తేదీన రెండవ శనివారం, ఆగస్టు 9వ తేదీన సాధారణ ఆదివారం కావడంతో ఎలాగూ సెలవులు ఉంటాయి.
ఇక ఆగస్టు 10న(సోమవారం) ప్రతిష్ఠాత్మక బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. అయితే, ఈ బోనాల సెలవుకు సంబంధించి విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. పండుగ సందర్భంగా నిర్వహించే రంగం, పోతరాజుల విన్యాసాలు, ఊరేగింపులను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో పలు కుటుంబాలు ఇప్పటికే స్వగ్రామాలకు వెళ్లేందుకు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాయి.
మరోవైపు, బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఒకవేళ విద్యాశాఖ నుంచి బోనాల సెలవుపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం విద్యార్థులకు వరుస సెలవులతో పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
నెలలో మొత్తం 11రోజుల వరకు సెలవులు
ఈ ఆగస్టు నెలలో ఐదు ఆదివారాలు, పండుగలు, ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తంగా 11రోజుల వరకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), ఈద్ మిలాద్-ఉన్-నబీ (ఆగస్టు 26) వంటి ప్రధాన పండుగలు కూడా ఈ నెలలోనే రానున్నాయి. అయితే బోనాల సెలవుపై స్పష్టత రావాలంటే విద్యాశాఖ అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది. సెలవుల నేపథ్యంలో ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.












