మనకు ప్రొఫెసర్ జయశంకర్ గురువు అయితే.. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబే గురువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మరోసారి తల్లడిల్లుతోందని చెప్పారు. నీటి వాటా విషయంలో రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఆడిస్తోందన్నారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పవర్‌లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.
గురువారం తెలంగాణ భవన్‍లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా జయశంకర్ సార్‍కు అద్భుతమైన అవగాహన ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో ఓ బీజేపీ ఎంపీ లోక్‌సభలో పోల్చితే రాష్ట్రంలో ఏ ఒక్క బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారా? వారికి రోషం అనేది ఉందా? అని నిలదీశారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే వారి గల్లా గల్లాపట్టకపోయేవాడా? అని అడిగారు.
భౌగోళిక సాధించుకున్నా మళ్లీ ఢిల్లీకి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని సీఎం రేవంత్ తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు పుష్కలంగా ఉన్నాయని.. పాలమూరు, కన్నెపల్లి పంపులను సీఎం ఆన్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. ‘మనకు జయశంకర్ సార్ గురువు. రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయడు గురువు’ అని కేటీఆర్ విమర్శించారు. బాబుకు వంత పాడటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రికి పట్టవన్నారు.
కనీసం ‘జై తెలంగాణ’ అనడానికి కూడా మనసొప్పని సీఎం మనకు ఉండటం మన దౌర్భాగ్యం అని అన్నారు. కేసీఆర్ అప్పులు చేయలేదని స్వయంగా కేంద్రమే చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు పరిస్థితి ఉందని, జయశంకర్ సార్ మళ్లీ వచ్చి ఇలాంటి వారికి పాఠాలు చెబితే బాగుండు అని మండిపడ్డారు. జీవితంలో ఎన్నడూ జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి, కేశవరావు మాత్రమే తెలంగాణలో మేధావులు అని సీఎం అంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మరి జయశంకర్ సార్, విద్యాసాగర్ లాంటి వారు ఎటుపోయారని కేటీఆర్ నిలదీశారు.












