కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక స్టార్టప్ ప్రస్థానం వ్యాపార రంగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రారంభంలో ఐడియా బాగోలేదని వంద మందికి పైగా ఇన్వెస్టర్లు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినప్పటికీ, వ్యవస్థాపకుడి చెక్కుచెదరని నమ్మకంతో నేడు ఆ కంపెనీ ఏకంగా 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38,000 కోట్లు) విలువైన దిగ్గజ సంస్థగా రూపాంతరం చెందింది. లండన్ కేంద్రంగా సేవలందిస్తున్న ఏఐ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్ 'సింథీషియా' సాధించిన ఈ అసాధారణ విజయగాథ ప్రతీ నవతరం పారిశ్రామికవేత్తకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
సింథీషియా సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ విక్టర్ రిపార్‌బెల్లీ 2017 నే ఈ వినూత్న ఆలోచనతో ముందడుగు వేశారు. కేవలం మనం ఇచ్చే టెక్స్ట్ కంటెంట్‌ను ఆధారంగా చేసుకుని, ఏఐ అవతార్ల ద్వారా అత్యంత నాణ్యమైన వీడియోలను సృష్టించే సాంకేతికతను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. దీనివల్ల భారీ బడ్జెట్‌తో కూడిన కెమెరాలు, నటీనటులు, స్టూడియోలు లేదా ఎడిటింగ్ టీమ్‌లతో పనిలేకుండానే నిమిషాల్లో ప్రొఫెషనల్ వీడియోలు తయారుచేసుకోవచ్చు. అయితే, వ్యాపార ఆరంభంలో ఏఐ ఆధారిత వీడియోల క్రియేషన్ అనేది కమర్షియల్‌గా వర్కవుట్ కాదని భావించి మెజారిటీ ఇన్వెస్టర్లు నిధులు ఇచ్చేందుకు వెనకడగు వేశారు.

అన్ని వైపుల నుంచి తీవ్ర తిరస్కరణలు ఎదురవుతున్న తరుణంలో రిపార్‌బెల్లీ ఒక కీలకమైన వ్యాపార వ్యూహాన్ని మార్చారు. తమ టెక్నాలజీని కేవలం వినోద రంగానికి పరిమితం చేయకుండా, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల ట్రైనింగ్, ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్, ఇంటర్నల్ ప్రెజెంటేషన్ల వంటి వ్యాపార అవసరాల వైపు మళ్లించారు. ఈ మాస్టర్‌ప్లాన్ కంపెనీ రూపురేఖలను మార్చేసింది. పట్టు వదలకుండా ప్రసిద్ధ ఇన్వెస్టర్ మార్క్ క్యూబన్‌కు పంపిన ఒక కోల్డ్ ఈమెయిల్ ద్వారా ప్రారంభ నిధులు దక్కించుకున్న ఈ ప్లాట్‌ఫామ్, ఆ తర్వాత క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్శించి యూరప్‌లోనే అగ్రగామి ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా అవతరించింది.
సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ప్రయోగాలు ఆరంభంలో అందరికీ అసాధ్యంగానే కనిపిస్తాయని, తిరస్కరణలు ఎదురైనంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకూడదని విక్టర్ రిపార్‌బెల్లీ అభిప్రాయపడ్డారు. సరైన ప్రణాళిక, ఆవిష్కరణపై స్పష్టమైన నమ్మకం, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన ఆలోచననైనా సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్‌గా మార్చవచ్చని సింథీషియా విజయం నిరూపించింది. ఇటీవల నిర్వహించిన ఫండింగ్ రౌండ్లతో ఈ సంస్థ మరింత వృద్ధి పథంలో పయనిస్తూ గ్లోబల్ టెక్ మార్కెట్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.












