పార్లమెంటులో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో కీలక బిల్లులను ఆమోదింపజేయడం సవాల్‌గా మారింది. ముఖ్యంగా రాజ్యాంగ సవరణలకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ లేకపోవడంతో... ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్న ప్రచారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
లోక్‌సభలో డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సంఖ్య కేంద్రానికి అత్యంత కీలకం. అందుకే గతంలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అంతేకాదు... డీఎంకే సహకరిస్తే కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తామనే సంకేతాలు కూడా వెళ్లాయనే ప్రచారం తమిళ రాజకీయాలను హిటెక్కించింది.
మరోవైపు గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే... ఇప్పుడు అదే బిల్లులకు మద్దతు ఇవ్వబోతుందనే వార్తలు వెలువడడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్టు సమాచారం. డీఎంకే ఎంపీలలోనే గందరగోళం నెలకొన్నట్లు, పలువురు నేతలు పార్టీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. బీజేపీకి మద్దతు ఇస్తే పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందని డీఎంకే అధిష్ఠానం భావిస్తుందని సమాచారం. ద్రోహం చేశారనే ముద్ర పడితే వచ్చే ఎన్నికల్లో రాజకీయ నష్టం తప్పదన్న అభిప్రాయంతో చివరి క్షణంలో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ ఆశలు నీరుగారిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. డీఎంకే నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో... కేంద్రం వెంటనే ప్రత్యామ్నాయ వ్యూహం అమలు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సంప్రదింపులు జరిపిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక గత కొంతకాలంగా వైసీపీ కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వైసీపీ ఎంపీలు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మిగిలిన పక్షాల మద్దతును దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందనే వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.












