Telangana: సైబర్ నేరాలపై తెలంగాణ ఉక్కుపాదం మోపింది. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన దేశవ్యాప్త 'ప్రగతి' (PRAGATI) సమీక్షలో, సైబర్ నేరాలను అరికట్టడంలో చూపిన పనితీరుకు గాను తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని రాష్ట్రాల సైబర్ సెక్యూరిటీ బ్యూరోల పనితీరును 9 కీలక అంశాల ఆధారంగా విశ్లేషణ చేసింది. ఇందులో అత్యుత్తమ పనితీరును పరిణగలోకి తీసుకుని తెలంగాణకు నెంబర్ 1 ర్యాంక్ ఖరారు చేసింది.
పీఎంవో అధికారుల ప్రకారం, స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్ (e-Zero FIR) అమలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం (GRM) వినియోగం, మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM-బాధితులకు తిరిగి నగదు ఇప్పించడం) వినియోగం, సహయోగ్ పోర్టల్, సమన్వయ పోర్టల్, సైబర్ నేరాల హాట్‌స్పాట్ నిర్వహణ, చట్ట అమలు సిబ్బంది సామర్థ్య పెంపు, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు వంటి తొమ్మిది కీలక అంశాలలో కనబరిచిన పనితీరు ఆధారంగా రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఇక పోలీసింగ్‌లో లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం, సైబర్ బాధితులకు వేగంగా అండగా నిలవడం వంటి నిరంతర చర్యలే తెలంగాణకు ఈ ఘనతను సాధించిపెట్టాయి. దేశంలోనే తొలిసారిగా S4C కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని కేంద్ర వేదికలను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.
ప్రజలు ఎలాంటి సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 నెంబర్‌కు డయల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్‌బీ సూచించింది. ఫిర్యాదుల పరిష్కారం, నష్టపోయిన డబ్బును తిరిగి పొందడంలో బాధితులకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా 87126 65600 హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అలాగే, పౌరులు ఈ సేవలను వినియోగించుకోవడంలో సహాయపడేందుకు అవసరమైన సూచనలతో కూడిన వీడియోలను తన అధికారిక సోషల్ మీడియా వేదికలలో విడుదల చేసింది.
TGCSB ప్రకారం, రాష్ట్ర GRM పోర్టల్ 2,368 ఫిర్యాదు అభ్యర్థనలలో 2,086 వాటిని పరిష్కరించి, 88 శాతం చర్యల రేటును సాధించింది. 'మనీ రెస్టోరేషన్ మాడ్యూల్' (Money Restoration Module) ద్వారా, అధికారులు రూ. 16.42 కోట్ల మేర తిరిగి పొందాల్సిన నిధులకు సంబంధించిన 28,000కు పైగా కేసులలో చట్ట అమలు ఆదేశాలను జారీ చేశారు. 'సహయోగ్ పోర్టల్' (Sahyog Portal) 89.41 శాతం కంటెంట్ తొలగింపు రేటును నమోదు చేయగా, 'సమన్వయ పోర్టల్' (Samanvaya Portal) ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అభ్యర్థనల విషయంలో 96.68 శాతం, తెలంగాణ పంపిన అభ్యర్థనల విషయంలో 79.22 శాతం పరిష్కార రేటును నమోదు చేసింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సమీక్షా సమావేశంలో TGCSB డైరెక్టర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ (IPS) పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు పౌర-కేంద్రిత డిజిటల్ సేవలను బలోపేతం చేయడానికి రాష్ట్రం చేస్తున్న నిరంతర కృషికి తెలంగాణ సాధించిన ఈ అగ్రస్థానం నిదర్శనమన్నారు.
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. బాగా చదువుకున్న వారిని సైతం ఈజీగా చీట్ చేస్తున్నారు. పెట్టుబడులు, లాభాల పేరుతో ఊరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఫేక్ లింకులతో, నకిలీ సందేశాలతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ మోసాల పట్ల పోలీసులు నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా మోసం చేస్తారో అన్నది వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.












