GOBARdhan Sheme: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోబర్ధన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించే దిశగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ స్థానంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోబర్ధన్ పథకానికి ఆమోద ముద్ర వేసింది. గోబర్ధన్ అంటే.. వ్యర్థాల నుంచి బయో గ్యాస్ తయారు చేయడం.
23,731 కోట్ల రూపాయల వ్యయంతో 'గోబర్ధన్' (జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకం)కు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోంలో నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బైహారా చారియాలి నుంచి తేజ్ పూర్ వరకు 8వేల 970 కోట్ల రూపాయలతో 136 కిలోమీటర్ల మేర ఈ నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టనుంది.
గోబర్ధన్ స్కీమ్ ద్వారా 1.5 లక్షల మంది ఉపాధి లభించనుందని కేంద్రం అంచనా వేసింది. దేశ స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో గోబర్ధన్ ఒక కీలక ఘట్టం. ఇది దేశంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, మడ్, మున్సిపల్ సేంద్రీయ వ్యర్థాలు, ఇతర బయోమాస్ వనరులను స్వచ్ఛమైన ఇంధనంగా, సేంద్రీయ ఎరువుగా, గ్రామీణ ఆదాయంగా, జాతీయ ఆర్థిక విలువగా మారుస్తుంది.
ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలవుతుంది. దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఒక ప్రధాన పిల్లర్ గా మారనుంది. దేశీయ కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన జీవ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం ఈ పథకం లక్ష్యం.
అస్సాంలోని గౌహతి సమీపంలోని బైహారా చారియాలి నుండి తేజ్‌పూర్ వరకు NH-15 వెంబడి 135.87 కిలోమీటర్ల పొడవు రూ. 8,970 కోట్లకు పైగా వ్యయంతో 4-లేన్ల రహదారి నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 'బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్' (BOT) టోల్ విధానంలో అభివృద్ధి చేస్తారు. భారత వైమానిక దళం సమన్వయంతో తేజ్‌పూర్ బైపాస్ వద్ద అత్యవసర ల్యాండింగ్ సదుపాయాన్ని నిర్మించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగం.
ఈ ప్రాజెక్టులో భాగంగా 58.7 కిలోమీటర్ల పొడవున ఐదు ప్రధాన బైపాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇవి బైహతా చారియాలి, సిపాఝర్, ఖరుపేటియా, దేకియాజులి. తేజ్‌పూర్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్లే మార్గాల్లోని రద్దీని తగ్గిస్తాయి. ఈ ప్రాజెక్టు సగటు ప్రయాణ వేగాన్ని 100 శాతం పెంచుతుంది, ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది, రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. వాహన నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. తద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుస్తుంది.












