క్రైమ్

షాబాద్‌ నరమేధం.. పోలీసుల నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలు తీసిందా?

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

పోక్సో కేసు నిందితుడి కిరాతకానికి ఒకే కుటుంబంలో ఆరుగురు బలైన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పోక్సో కేసు నిందితుడి కిరాతకానికి ఒకే కుటుంబంలో ఆరుగురు బలైన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నరమేధానికి పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు సరైన రక్షణ కల్పించకపోవడం, నిందితుడి బెదిరింపులపై ముందే ఫిర్యాదు చేసినా ఖాకీలు పట్టించుకోకపోవడమే ఈ ఘోరానికి కారణమంటూ మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు ముందే స్పందించి ఉంటే ఇవాళ ఆరుగురి ప్రాణాలు దక్కేవని కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను వేధిస్తున్నాడంటూ మే 16వ తేదీన బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజ్‌కుమార్‌ (28)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, పోలీసులు కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లను మాత్రమే జత చేయడంతో, నిందితుడికి కేవలం రూ.20వేల పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ లభించింది.

జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్‌కుమార్.. తనపై పోక్సో కేసు పెట్టారని కక్ష పెంచుకున్నాడు. "మీ నాన్నను ఎలా చంపేశానో, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తా" అంటూ బాధిత కుటుంబాన్ని బహిరంగంగానే బెదిరించాడు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, స్థానిక సిబ్బంది వారిపైనే దురుసుగా ప్రవర్తించి వెనక్కి పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రి 11 గంటల సమయంలో దైవాలగూడలో ఉన్న బాధితుల ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డువచ్చిన బాలిక తల్లి, అమ్మమ్మలను అక్కడికక్కడే ఘోరంగా నరికి చంపాడు. అనంతరం సదరు బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లి, సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి, అనంతరం గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఆపై తన ఇంటికి చేరుకుని భార్య సరిత, ఇద్దరు కన్నబిడ్డలను సైతం పశువులా వేటాడి కడతేర్చాడు.

రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు దాదాపు రెండు గంటల పాటు ఈ ఉన్మాది మారణకాండ సాగింది. వరుస హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ నేరుగా తన తండ్రికి ఫోన్ చేసి, తాను చేసిన ఘోరాన్ని వివరించి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ సమాచారంతో నిందితుడి తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నరమేధం వెలుగులోకి వచ్చింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

#Shabad Murders#Telangana Crime#Police Negligence#POCSO Case#Breaking News#Crime Investigation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి