Akhil: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద తన అసలైన మాస్ పవర్‌ను చూపించారు. ఆయన నటించిన తాజా రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ థియేటర్లలో అడుగుపెడుతూనే సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. అఖిల్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ‘లెనిన్’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 5.90 కోట్లుగా ఉండగా, గ్రాస్ కలెక్షన్స్ రూ. 6.73 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అఖిల్ హవా నడిచింది, అక్కడ దాదాపు రూ. 3.00 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ. 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం.
దర్శకుడు కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ ఊరమాస్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ సరికొత్త మేకోవర్‌తో అదరగొట్టగా, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.
చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు ‘లెనిన్’ రూపంలో అసలైన పండగ వచ్చింది. "అయ్యగారు ఈసారి గట్టి కంబ్యాక్ ఇచ్చారు" అంటూ సోషల్ మీడియా అంతా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ‘లెనిన్’తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించారనే చెప్పాలి.












