ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మరో సర్జరీ జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఆయనకు బాడీలో సర్జరీ జరిగినట్టు తెలిసింది. ఆ మధ్యలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా పవన్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. తాజాగా ఆయనకు మరో సర్జరీ జరగగా.. ఫ్యాన్స్, జనసైనికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎంకు ముంబైలోని కొకిలా బెన్ ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం ఈ అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించింది.
ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నట్టు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది. భుజం కండరాలు, కీళ్లకు సంబంధించిన ఈ తీవ్రమైన సమస్య కారణంగానే ఆయన గత కొంతకాలంగా నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకే శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం.
దాదాపు మూడున్నర గంటల పాటు పవన్‌కు శస్త్రచికిత్స జరిగినట్టు తెలిసింది. రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచించినట్టు సమాచారం. అందుకే ముందు ఒకే భుజానికి శస్త్రచికిత్స పూర్తి చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కొకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. రెండో భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నట్టు డాక్టర్లు తెలిపారు.
పవన్‌కు సర్జరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. ‘గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో, అత్యంత వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.












