పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చి తన మీద కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులు, తన భార్య బిడ్డలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడి చేతిలో హత్యకి గురైన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలను చేవెళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్ పల్లి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు..
పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళితే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేనందునే ఆరు హత్యలు జరిగాయని ఆరోపించారు. హోంమంత్రి శాఖను సీఎం తన వద్దే ఉంచుకుని సరిగా పనిచేయకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు.












