ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో సతమతమవుతున్న ఆమెను, ఆమె కుమార్తె మాధవిని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ఉదయం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి (చెస్ట్ హాస్పిటల్) ప్రాంగణంలో వదిలివెళ్లారు. అక్కడ అనాథల్లా పడివున్న వారిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్యుల బృందం తల్లి, కుమార్తెలకు తక్షణమే క్షయ (టీబీ) నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. అయితే వారికి టీబీ లేదని తేలినప్పటికీ, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉండలేక వారు గురువారం సాయంత్రానికి తిరిగి ఎర్రగడ్డ ఆసుపత్రికే చేరుకోగా, అధికారులు మానవత్వంతో వారిని చేర్చుకుని బోరబండ పోలీసులకు సమాచారం అందించారు.
ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజు (శుక్రవారం), ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న పావలా శ్యామల, ఆమె కుమార్తెకు శాశ్వత రక్షణ కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ప్రత్యేక రక్షణ నడుమ వారిద్దరినీ నగరంలోని ఒక సురక్షితమైన అనాథాశ్రమానికి తరలించారు. గతంలోనూ ఆమె ఆర్థిక సాయం కోసం, చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించలేక తీవ్రంగా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.












