ప్రపంచంలోకి ఏఐ అడుగుపెట్టిన తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఒకవైపు ఏఐ వల్ల ఉపయోగం ఉన్నట్టే కనిపించినా మరోవైపు ఏఐ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని.. ఇప్పటికే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐతే ఓపెన్ ఏఐ గోప్యత విషయంలో టెక్‌సంస్థలైన యాపిల్ - ఓపెన్ ఏఐ మధ్య చెలరేగిన వివాదం చివరికి ముదిరింది. ఈ నేపథ్యంలో తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్.. ఓపెన్ ఏఐపై దావా వేసింది. అలాగే యాపిల్‌లో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులపై కూడా చట్టపరమైన చర్యలకు దిగింది.
సంస్థకు చెందిన అత్యంత గోప్యమైన డిజైన్‌లు, తయారీ ప్రక్రియలు, సరఫరా గొలుసు వ్యూహాలు వంటి కీలక సమాచారాన్ని అక్రమంగా సేకరించి ఉపయోగించారంటూ ఆరోపణలు చేసింది. ఉద్యోగులు తమ సంస్థ నుంచి వెళ్లిపోయేటప్పుడు కంపెనీ ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇవ్వలేదని యాపిల్ పేర్కొంది. ఆ తర్వాత అందులోని ఓ బగ్ సాయంతో తమ ఇంటర్నల్ నెట్‌వర్క్‌లోకి చొరబడి సున్నితమైన రహస్యాలను తెలుసుకున్నారనిపేర్కొంది.
ప్రస్తుతం ఓపెన్‌ఏఐలో హార్డ్‌వేర్ చీఫ్‌గా ఉన్న టాన్ గతంలో యాపిల్‌లో పనిచేశారు. ఆయన తమ సమాచారాన్ని ఓపెన్‌ఏఐ హార్డ్‌వేర్ ప్రాజెక్టులకు ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు దావాలో పేర్కొంది. ప్రస్తుతం సుమారు 400 మంది మాజీ యాపిల్ ఉద్యోగులు ఓపెన్‌ఏఐలో పనిచేస్తున్నారని యాపిల్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఓపెన్‌ఏఐ హార్డ్‌వేర్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జానీ ఐవ్ స్థాపించిన ఐఓ ప్రొడక్ట్స్ సంస్థను 6.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే ఈ కేసులో జానీ ఐవ్ పేరును యాపిల్ చేర్చలేదు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఈ పరిణామం సంచలనంగా మారింది.












