రాష్ట్రంలో కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బతికి ఉన్న వ్యక్తులను చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి వారిపేరిట ఉన్న ఆస్తులను దోచేస్తున్నారు. అందుకు కొందరు ప్రభుత్వ అధికారులు సైతం సాయం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.తాజా ఘటనే అందుకు బెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు. ఓ వ్యక్తి పేరిట ఉన్న 5 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కొట్టేయాలని అదే ఊరిలో ఉన్న మరోవ్యక్తి ప్రయత్నించగా అందుకు జీపీవో సాయం చేసినట్టు తెలిసింది.దీంతో బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కాజేశారు.
కాగా, ‘నేను బతికే ఉన్నాను..నా భూమి నాకు ఇవ్వండి’ అంటూ భూమి అసలు యాజమాని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడె గ్రామంలో ఐదెకరాల అసైన్డ్ భూమి సాగు చేసుకుంటూ సత్యం అనే వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు.అతనికి నలుగురు కూతుర్లు. వివాహం చేసుకుని వారు వెళ్లిపోగా, బతుకు దెరువు కోసం వేరే ప్రాంతంలో కొడుకు నివసిస్తున్నాడు.సత్యం ఒంటరిగా ఉంటున్నాడని గమనించి తన ఐదెకరాల అసైన్డ్ భూమిపై నామా సత్యనారాయణ అనే వ్యక్తి కన్నేశాడు.
జీపీవో అనంతలక్ష్మి సహాయంతో సత్యం 2018లోనే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, సత్యనారాయణ భార్య పుష్పవతి బాధితుడికి ఏకైక కూతురని నిందితుడు మరో కుటుంబ సర్టిఫికెట్ సృష్టించాడు.ఈ రెండు నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా సత్యం పేరు మీద ఉన్న భూమిని సత్యనారాయణ భార్య పుష్పవతి పేరిట తహసీల్దార్ వారసత్వ బదిలీ చేశారు.అయితే తన సంతకాన్ని, ఆర్ఐ వీరస్వామి సంతకాన్ని ఫోర్జరీ చేసి, జీపీవో నకిలీ కుటుంబ పత్రాన్ని సృష్టించిందని, దాని ఆధారంగా పొరపాటున భూబదిలీ చేశానని తహసీల్దార్ రాంనరేష్ ఒప్పుకున్నారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన జీపీవో అనంతలక్ష్మిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.












