రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని పూర్తిగా అరికట్టేందుకు అసోం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్న పురుషులకు ఇకపై ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిబంధనను ఉల్లంఘించే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనలను పొందుపరిచింది.
రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలను కలిగిన ఏ పురుషుడైనా ప్రభుత్వ పథకాలకు అనర్హుడవుతాడని ఆయన సభకు వివరించారు. మహిళా సాధికారతను పెంపొందించడం, సమాజంలో లింగ సమానత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే 'అసోం సర్వీసెస్ రూల్స్-1964'కు అవసరమైన సవరణలు చేయనున్నట్లు పేర్కొనగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.
షెడ్యూల్డ్ తెగలకు మినహాయింపు..
బహుభార్యత్వాన్ని నిర్మూలించేందుకు అసోం ప్రభుత్వం గత కొంతకాలంగా అత్యంత కఠినమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే 2025 నవంబర్‌లోనే "అసోం బహుభార్యత్వ నిషేధ బిల్లు, 2025"ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. మొదటి భార్య బతికుండగా, ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేలా నిబంధనలు రూపొందించారు. అయితే, అక్కడి కొన్ని షెడ్యూల్డ్ తెగలకు, ఆరో షెడ్యూల్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.












