అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి సంక్షోభం చుట్టూ అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ పోరు కొనసాగుతోంది.
మళ్ళీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్.. పడిపోయిన చోటే నిలదొక్కుకుని అధికారం చిక్కించుకోవాలని బిఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రెస్మిట్లు పెడుతూ.. తప్పు మీదంటే మీదని విమర్శించుకుంటున్నారు. ఇక బిఆర్ఎస్.. రైతు సమస్యలను అస్త్రాలుగా మలచుకుని.. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ఎత్తిపోతలు, రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై ఘాటుగా స్పందిస్తూ.. రేవంత్ సర్కార్ ను చిక్కుల్లో పడేయాలని చూస్తుంది.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఇచ్చిన నివేదికను చూసి అయినా సోయి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ను బద్నాం చేయాలనే కుట్రతోనే నీళ్లివ్వడం లేదని ఆరోపించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డ కేటీఆర్.. 2022లో వచ్చిన వరదల ఫోటోలు చూపించి కన్నెపల్లి మునిగిపోయిందంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు..
మరోవైపు భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రమాదం ఉందని తెలిసినా.. మేడిగడ్డ వల్లే మునుగుతోందనే మాటలతో మాయ చేస్తూ.. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకుంటున్నాడాని ధ్వజమెత్తారు. గోదావరిలో లక్షల క్యూసెక్కుల వరద నీరు కళ్లముందు కిందకు పోతుంటే.. పట్టనట్టు ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు..
మా క్యారెక్టర్ గురించి మాట్లాడే వాళ్ళు ముందు తమ క్యారెక్టర్ ఎలాంటిదో గమనించుకోవాలని హితవు పలికిన కేటీఆర్.. ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్‌తో, రాత్రికి బీజేపీ వాళ్లతో భుజాలు రాసుకునే రేవంత్ రెడ్డి.. హరీష్ రావు శీల పరీక్ష గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి మొదట శీల పరీక్ష చేయాల్సిందని ఎద్దేవా చేశారు.. పాలన ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు 117 అసెంబ్లీ స్థానాలు కాదు కదా.. కనీసం 7 సీట్లు కూడా రావని విమర్శించారు.












