టాప్ న్యూస్

జవహర్‌ నగర్ డంప్‌యార్డ్‌ పై పొలిటికల్ వార్!.. ఆరోగ్యం కాపాడమంటే అరెస్టులా!..

రచన: Venu7 నిమిషాల పఠనం

జవహర్‌నగర్ డంప్ యార్డ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు ప్రజాప్రతినిధులు, జేఏసీ నాయకులు, స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అరెస్టయిన వారిని షామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రాణాలు తీస్తున్న జవహర్‌నగర్ డంప్ యార్డ్‌

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

డంప్ యార్డ్ తరలించకుండా జాప్యం

ఆరోగ్యం కాపాడమంటే అరెస్టులా

కాంగ్రెస్ తీరుపై ఈటల విమర్శలు

హైదరాబాద్ ను జీరో పొల్యూషన్ సిటీ గా మారుస్తానని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి కళ్ళకి జవహర్‌నగర్ డంప్ యార్డ్ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల కష్టాలు కనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ సమస్య కొత్తది కాదని, ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఈ సమస్యకు పరిష్కారం చూపించడం లేదు ఎందుకని అన్నారు..

గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని అవకాశంగా మలచుకుని ఓట్లు రాబట్టుకొందని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జవహర్ నగర్ తో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఈటల ఆరోపించారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ ను తరలించి ఎంపీగా నీకు ఓటు వేసిన వారి రుణం తీర్చుకో రేవంత్ అని హితవు పలికారు.

ఒకప్పుడు స్థానిక ప్రాంతాల చెత్త మాత్రమే ఇక్కడికి వచ్చేదని, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు రెండు కోట్ల మంది ఉత్పత్తి చేసే చెత్త మొత్తం జవహర్‌నగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లోనే పేరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఒకే ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో చెత్తను నిల్వ చేయరని ఈటెల మండిపడ్డారు.

అనేక ఉద్యమాల తర్వాత లీచేట్ వాటర్ ట్రీట్‌మెంట్ చేస్తామని, చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే రోజుకు సుమారు పదివేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుండగా, కేవలం మూడున్నర వేల మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారని తెలిపారు. మిగిలిన ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడే పేరుకుపోయి పర్యావరణానికి ప్రమాదంగా మారుతోందన్నారు.

డంప్ యార్డ్ ప్రభావం కేవలం జవహర్‌నగర్‌కే పరిమితం కాలేదని, బాలాజీనగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, ఘట్‌కేసర్ ప్రాంతాలతో పాటు దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. భరించలేని దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సమస్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేసిన ఈటల, ముఖ్యమంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.

రెండు నెలల క్రితం శాశ్వత పరిష్కారం చూపాలని కోరినా ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు. ఈ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులు, జేఏసీ సభ్యులను తెల్లవారుజామున ఇళ్ల నుంచి తీసుకెళ్లి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఈటల రాజేందర్ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరైంది కాదని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ఆరోపించారు.

అరెస్టులు, కేసులు సమస్యలకు పరిష్కారం కాదని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి భారం తగ్గించాలని సూచించారు. జీరో పొల్యూషన్, జీరో వ్యర్థాల లక్ష్యంతో జవహర్‌నగర్, బాలాజీనగర్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు.

జీరో పొల్యూషన్ తో చెత్తను కూడా కన్వర్ట్ చేసే ఆస్కారం ఉండంగా నువ్వు ఎవరి కొమ్ము కాయడానికో .. ఏ కాంట్రాక్టర్ల మెప్పు పొందడానికో.. పేదల జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికిన ఈటల రాజేందర్.. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

#telangana#Political#Jawahar Nagar#dumpyard#Arrest#health protection#congress#bjp#Etela Rajender
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి