విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధాగాయత్రి మృతి కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు ఒక కీలకమైన అడుగు ముందుకు వేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆమె భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ జిల్లా డీఎస్‌పీ జేసీ పంత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. గత నెలలో ఈ దంపతులు ముస్సోరీ-ధనౌల్తి పరిసరాల్లోని ఒక హోమ్‌స్టేకి వెళ్లిన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. జూన్ 15వ తేదీన అక్కడ రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ వ్యవహారంపై మృతురాలి తండ్రి పారుపూడి సుధాకర్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే శ్రీచరణ్ తన కుమార్తెను మానసికంగా వేధించేవాడని, ఆమె కదలికలపై నిఘా ఉంచేందుకు బ్యాగులో రహస్యంగా జీపీఎస్ (GPS) పరికరాన్ని కూడా పెట్టాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్రదేశానికి కాకుండా, భార్యకు చెప్పకుండా ముస్సోరీలో రూమ్ బుక్ చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, రాధాగాయత్రి అనారోగ్యంతోనే చనిపోయిందంటూ శ్రీచరణ్ కట్టుకథలు అల్లే ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ముస్సోరీ పోలీసులు... శ్రీచరణ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రీచరణ్ తల్లిదండ్రులకు సైతం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు పంపారు. అయితే పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో మరణానికి గల కారణాలు స్పష్టమవ్వకపోవడంతో, కీలకమైన అంతర్గత అవయవాల (విసెరా) నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ జిల్లా అధికారులు ఈ ఘటనపై మేజిస్టీరియల్ దర్యాప్తు జరుపుతూ, హోమ్‌స్టేలోని సీసీటీవీ దృశ్యాలను, నిందితుడి బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.












