మనిషి జీవితంలోకి ఆధునిక సాంకేతికత అడుగుపెట్టిన నాటి నుంచి ప్రపంచం పరుగులు పెట్టడం ప్రారంభించింది. ఒకప్పుడు ఊహగా అనిపించిన ఎన్నో విషయాలు, నేడు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. మనుషుల ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయో, అభివృద్ధి కూడా అంతే వేగంగా కొత్త దారులు తొక్కుతోంది.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే... పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న హైదరాబాద్‌కు, నేడు ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు ఎంత తేడా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, అత్యాధునిక రహదారులు, డిజిటల్ సేవలు, స్మార్ట్ మౌలిక వసతులు... ఇవన్నీ మార్పుకు నిదర్శనాలు.
అలాగే రవాణా రంగం కూడా విప్లవాత్మకంగా మారిపోయింది. ఒకప్పుడు గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన దూరాలను, నేడు నిమిషాల్లో చేరుకునే పరిస్థితి వచ్చింది. టెక్నాలజీ తెచ్చిన ఈ మార్పులు కేవలం సౌకర్యాలను మాత్రమే కాదు... మన జీవన విధానాన్నే పూర్తిగా కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపుతూ.. పలు సమావేశాలు నిర్వహిస్తూ.. బీజేపీ పాలనలో వచ్చిన మార్పులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.
ఇందులో భాగంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా హైదరాబాద్ లో పలు సమావేశాలు నిర్వహించారు. రైల్వే శాఖ, హైదరాబాద్ కేంద్రంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు. కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికే మూడు ప్రధాన మార్గాలకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.
గత బడ్జెట్ లో ప్రకటించిన విధంగా దేశ వ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపిన అశ్వినీ వైష్ణవ్.. వీటిలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఖరారు చేసినట్లు ప్రకటించారు. కొత్త సాంకేతికతను వినియోగిస్తూ.. పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో రైళ్లను అందుబాటు లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.
ఇక బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవడానికి కేవలం 1 గంట 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని తెలిపారు.. అదే విధంగా హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో.. హైదరాబాద్ నుంచి చెన్నయ్‌కి రెండు గంటల్లో వెళ్లవచ్చని తెలియచేశారు..
గత యూపీఏ ప్రభుత్వంలో రూ 800 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే.. మేము తెలంగాణకు 5000 కోట్ల రూపాయలు ఇచ్చామని వివరించిన వైష్ణవ్.. భారతీయ రైల్వేలో వస్తున్న విప్లవాత్మక మార్పుల క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు..












