తెలంగాణ శాసనసభలో సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రభుత్వాన్ని ఒక సంచలన, కీలకమైన విజ్ఞప్తిని చేశారు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్) నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా తెలంగాణలోని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి వలస వచ్చి స్థిరపడిన బెంగాలీ కుటుంబాలకు 'ఎస్సీ' (షెడ్యూల్డ్ కులాల) సామాజిక వర్గ ధ్రువీకరణ పత్రాలు (Caste Certificates) మంజూరు చేయాలని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని కాగజ్‌నగర్, ఈస్గాం తదితర ప్రాంతాలలోని సుమారు 15 గ్రామాలు/పునరావాస కాలనీల్లో దాదాపు 20వేల మందికి పైగా ఈ బెంగాలీ శరణార్థుల కుటుంబాలు నివసిస్తున్నాయి. నామశూద్ర (Namasudra) వంటి సామాజిక వర్గాలకు చెందిన వీరికి పశ్చిమ బెంగాల్‌లో 1996 వరకు వీరికి ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ హోదా అమల్లో ఉందని, అయితే తెలంగాణలో వారికి కుల ధ్రువీకరణ పత్రాలు అందక ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలకు దూరమవుతున్నారని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు.
మానవీయ కోణంలో ఆలోచించి, దశాబ్దాలుగా ఇక్కడే నివాసముంటున్న ఈ బెంగాలీ కుటుంబాల వారసులకు తక్షణమే ఎస్సీ సర్టిఫికెట్లు జారీ అయ్యేలా రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ డిమాండ్ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లోనూ, అసెంబ్లీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సిర్పూర్ ప్రాంత ప్రజలు, శరణార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఏళ్ల తరబడి స్థానికంగానే నివసిస్తూ అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లేవనెత్తిన ఈ అంశంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక సర్వే చేపట్టి, వీరికి శాశ్వత పరిష్కారం చూపేలా జీవో జారీ చేయాలని స్థానిక బెంగాలీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












