అధికార పార్టీలో సీన్ మారుతున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ఎపిసోడ్ అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలు ఆలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ గుర్తుమీద గెలిచిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిపై కొన్ని నెలల పాటు ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేయడంతో గడ్డం ప్రసాద్ కుమార్..పార్టీ మారిన వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు.
దానంకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆయన బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరి అనంతరం హస్తం పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఇదే విషయాన్ని గులాబీ నేతలు హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఆయన సభ్యత్వంపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.
దీంతో పార్టీ మారిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలు టెన్షన్‌లో ఉన్నట్టు సమాచారం.అయినప్పటికీ వారికి న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీరంతా పార్టీ మారినా అసెంబ్లీ రికార్డుల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు.వారు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి పత్రాలు గానీ, వేరే పార్టీ బి-ఫామ్‌లు గానీ దాఖలు చేయలేదు. కేవలం కండువాలు కప్పుకోవడం, ఫోటోలు, పేపర్ క్లిప్పింగులు మాత్రమే కోర్టుల్లో చట్టబద్ధమైన ఫిరాయింపు సాక్ష్యాలుగా నిలబడవని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ 8 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలకు తక్షణమే ఎలాంటి న్యాయపరమైన ముప్పు లేదని న్యాయనిపుణుల అంచనా వేస్తున్నారు. అయితే, పార్టీ మారిన వారంతా తిరిగి తమ సొంతగూటికి వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు కేటీఆర్‌కు టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.
పార్టీ మారినా కాంగ్రెస్‌లో అనుకున్నంత మేర ప్రాధాన్యం లేకపోవడం, పదవుల్లోనూ అసలైన కాంగ్రెస్ నేతలే కొట్లాడుతున్నారని, తమను నమ్ముకుని వచ్చిన వారికి న్యాయం చేయలేపోతున్నామని కొందరు అభ్రతాభావంలో ఉన్నట్టు తెలిసింది. ముగ్గురు లేదా నలుగురు జీహెచ్ఎంసీ ఎన్నికలలోపు గులాబీ గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతుండగా.. మిగతా వారు వచ్చే ఎన్నికల వరకు వెళ్లే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.










