విద్యార్థులకు పాఠశాలల్లో చికెన్ బిర్యానీ వడ్డించేందుకు తమిళనాడు సర్కార్ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిమీద ప్రతిపక్ష డీఎంకే పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తినా సీఎం విజయ్ మాత్రం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థులను పోషకాహార లోపం నుంచి బయటపడేయాలని టీవీకే సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (మిడ్-డే మీల్స్) కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని, దీని మీద అధ్యాయనం చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం విజయ్ ఆదేశించినట్టు తెలిసింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు, ప్రభుత్వ బడుల్లో వారి హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో విద్యావిప్లవం ప్రతిసారీ పోషకాహార లోపం వల్లే సాగిందని, అందుకే విద్యార్థులకు మరింత బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ఈ సరికొత్త ఆలోచనను తెరపైకి తెచ్చినట్టు విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.ఈ ప్రతిపాదనపై తమ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని, సాంఘిక సంక్షేమ శాఖతో పాటు ఉన్నత స్థాయి సంప్రదింపుల తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మిడ్ డే మీల్స్‌లో బిర్యానీ ప్రవేశపెట్టే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.వెజిటేరియన్ తినే విద్యార్థులకు పౌష్టిక శాకాహార భోజనమే కొనసాగుతుందని,మాంసాహారం తినే పిల్లలకు మాత్రమే ఆప్షనల్ కింద చికెన్ బిర్యానీ వడ్డిస్తారని స్పష్టం చేశారు. ఎదిగే పిల్లలకు అవసరమైన ప్రొటీన్లు అందించడం అత్యంత ఆవశ్యకమని, దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని 11, 12వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.











