శంషాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ సమీపంలోని పాలమాకుల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు గణేష్ నిమజ్జనం అనంతరం శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ప్రమాదం ధాటికి ఇన్నోవా కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న కేతావత్ లింబ్య, ఆయన భార్య జమున, కత్రావత్ మాన్‌సింగ్, కేతావత్ వాస్రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడటంతో శంషాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి అతివేగమా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమా.. మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే శంషాబాద్ పరిసరాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 14న హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి హోటల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
అంతకుముందు సెప్టెంబర్ 5న షంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇక తెలంగాణలో 2026 జనవరి 1 నుంచి జూలై 27 వరకు రాష్ట్రంలో 16,179 ప్రమాదాలు నమోదై, 4,452 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్టే.
ఇదే కాలంలో జాతీయ రహదారులపై 4,522 ప్రమాదాలు జరగగా 1,559 మంది మరణించారు. కాగా ఇటీవలి శంషాబాద్ ప్రమాదం మరోసారి వేగం, అప్రమత్తత, రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబాల జీవితాలను తలకిందులు చేస్తోంది. అందుకే డ్రైవింగ్ సమయంలో వేగ నియంత్రణ, నిద్రలే










