మన శరీరాన్ని నడిపించే అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఆలోచించడం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, శరీర కదలికలను నియంత్రించడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు మెదడు ద్వారానే జరుగుతాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం..
ముందుగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు విశ్రాంతికి, ఒత్తిడి నియంత్రణకు సహాయపడతాయి. అదే సమయంలో అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి అంశాలను అదుపులో ఉంచుకోవడం కూడా మెదడు ఆరోగ్యానికి ముఖ్యమే. అవసరమైతే వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి.
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చేపలు, గింజలు వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం మంచిది. చేపలు, అక్రూట్ వంటి వాటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి.
మెదడును చురుకుగా ఉంచేందుకు పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్ నింపడం అలవాటు చేసుకోవాలి. అలాగే పెద్దలకు సాధారణంగా ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రకు ముందు మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం నిద్రకు మేలు చేస్తుంది. అలాగే ఇతరులతో మాట్లాడటం, సామాజికంగా చురుకుగా ఉండటం, భావాలను పంచుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. తగినంత నీరు తాగడం, పొగతాగడం మానేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం కూడా ముఖ్యం.
అంతేకాదు, తలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బైక్‌పై హెల్మెట్, కారులో సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. మొత్తంగా చూస్తే.. మెదడు ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన ఒక్క చిట్కా కంటే, వ్యాయామం, పోషకాహారం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ, సామాజిక సంబంధాలు, ఆరోగ్య సమస్యల నియంత్రణ వంటి అలవాట్లను క్రమంగా పాటించడం ఎంతో ముఖ్యం అని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












