సంపూర్ణ మద్య నిషేధంపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మద్యం అందుబాటును పూర్తిగా నిలిపివేయడం ద్వారా సమస్య అంతమవుతుందని భావించడం కంటే.. అక్రమ సారా తయారీ, కల్తీమద్యం, దొంగచాటు రవాణా, రహస్యంగా మద్యం విక్రయాలు వంటి పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే మద్య నిషేధం అమలు వల్ల ప్రభుత్వాలు ఎక్సైజ్ ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు.. నిషేధాన్ని అమలు చేసేందుకు పోలీసింగ్, తనిఖీలు, నిఘా వ్యవస్థలపై భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ధర్మాసనం ప్రస్తావించింది. ముఖ్యంగా మద్యం కోసం తీవ్రంగా ప్రయత్నించే వ్యసనపరులు.. అందుబాటులో లేకపోయినా తమ ప్రయత్నాలను పూర్తిగా ఆపకపోవచ్చని, దాని ఫలితంగా అక్రమ మార్గాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
మహారాష్ట్రకు సంబంధించిన ఓ కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.. కల్తీమద్యం తయారీలో ఉపయోగించే మిథనాల్‌ను ఔషధేతర పరిశ్రమలకు విక్రయించే సమయంలో.. దానికి రంగు, రుచి కలిగించే పదార్థాలు తప్పనిసరిగా కలపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా, సహేతుకంగా లేవని జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్‌చంద్రన్ ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే కల్తీమద్యం వల్ల జరిగే మరణాలను అరికట్టాల్సిన అవసరాన్ని మాత్రం కోర్టు గట్టిగా నొక్కిచెప్పింది. మిథనాల్ విక్రయాలు, నిల్వలు, రవాణా, సరఫరాపై కఠిన నియంత్రణలు ఉండాలని సూచించింది. ఎక్సైజ్ చట్టాలను మరింత సమర్థంగా అమలు చేసి.. అక్రమ మద్యం తయారీ, రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంది.
మరోవైపు సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. రుణ బకాయిల విషయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకునే విధానంపై కోర్టు చట్టపరమైన ప్రక్రియ, రుణగ్రహీతల హక్కులను పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా ఔషధాల నియంత్రణకు సంబంధించిన కేసులో డ్రగ్ రెగ్యులేటరీ అధికారుల తనిఖీలు, నమూనాల సేకరణ, ప్రాసిక్యూషన్ అధికారాల పరిధిపైనా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది.











