తెలంగాణ

AMRపై ఈడీ దాడులు.. రూ.6.35 కోట్ల ఆస్తులు సీజ్.. అసలు ఏం జరిగింది?

రచన: Kashi9 నిమిషాల పఠనం

ఏఎంఆర్ గ్రూప్ సంస్థలపై జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 11న హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. తాజాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, సెక్యూరిటీలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు కీలకమైన డిజిటల్ పరికరాలు, ఆర్థిక రికార్డులను కూడా సేకరించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.

AMRపై ఈడీ దాడుల్లో కీలక పరిణామం

రూ.6.35 కోట్ల ఆస్తులు, నగదు, సెక్యూరిటీల ఫ్రీజ్

కీలక డిజిటల్ ఆధారాలు స్వాధీనం

ఏఎంఆర్ గ్రూప్ సంస్థలపై జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 11న హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. తాజాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు, నగదు, సెక్యూరిటీలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు కీలకమైన డిజిటల్ పరికరాలు, ఆర్థిక రికార్డులను కూడా సేకరించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు అసలు దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది అన్నదానిపై ఆసక్తి పెరిగింది.

రూ.6.35 కోట్ల విలువైన ఆస్తులు ఫ్రీజ్

కోల్‌కతాకు చెందిన SREI గ్రూప్ రుణాల ఎగవేతకు సంబంధించి కొనసాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగానే AMR/AMRL గ్రూప్‌కు సంబంధించిన సంస్థలపై సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. PMLA-2002లోని సెక్షన్ 17 కింద సెప్టెంబర్ 11న ఒడిశాకు చెందిన ARSS గ్రూప్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన AMR/AMRL గ్రూప్ ప్రమోటర్లు, అనుబంధ సంస్థలకు సంబంధించిన పలు ఆఫీసుల్లో ఈ సోదాలు జరిగాయి.

సోదాల సందర్భంగా మొత్తం రూ.6.35 కోట్ల విలువైన ఆస్తులు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫ్రీజ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఇందులో సుమారు రూ.1.50 కోట్ల బ్యాంకు నిల్వలు, రూ.2.90 కోట్ల డీమ్యాట్, సెక్యూరిటీల హోల్డింగ్స్, రూ.1.95 కోట్ల విలువైన నగదు, నగలు ఉన్నట్లు వెల్లడించింది. అంటే ఈడీ దర్యాప్తు కేవలం కంపెనీల పత్రాల పరిశీలనకే పరిమితం కాకుండా ఆస్తులు, నగదు, పెట్టుబడుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

రూ.1,111 కోట్ల రుణాలే అసలు విషయం

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం రూ.1,111 కోట్ల రుణ బకాయిలు. ఈడీ లెక్కల ప్రకారం.. సోదాలు జరిగిన AMR/AMRL, ARSS గ్రూపులకు సంబంధించి మొత్తం రూ.1,111 కోట్ల రుణాలు బకాయిగా ఉన్నాయి. ఈ రుణాలు కోల్‌కతాకు చెందిన SREI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, SREI ఎక్విప్ మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి పొందినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

AMRL Hitech City Limited, AMRL గ్రూప్‌కు చెందిన ఇతర సంస్థలు, ARSS Infrastructure Projects తదితర సంస్థలు SREI నుంచి భారీ మొత్తంలో రుణ సదుపాయాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. అయితే ఆ రుణాలు తర్వాత తిరిగి చెల్లించకుండా బకాయిలుగా, డిఫాల్ట్‌లుగా మిగిలిపోయినట్లు పేర్కొంది. దీంతో ఈ రుణాల వెనుక అసలు ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్నదానిపై ఈడీ దృష్టి పెట్టింది.

డబ్బు ఎక్కడికి వెళ్లింది?

ఇక్కడే ఈ కేసులో అసలు ఆసక్తికరమైన అంశం మొదలవుతుంది. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడమే కాకుండా.. ఆ డబ్బును ఎలా ఉపయోగించారు? ఏ కంపెనీలకు మళ్లించారు? ఒక సంస్థ నుంచి మరో సంస్థకు నిధులు బదిలీ అయ్యాయా? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు ఈడీ తెలిపింది.

తన ప్రకటనలో ఎవర్‌గ్రీనింగ్, నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్ వంటి అంశాలను కూడా ఈడీ ప్రస్తావించింది. అంటే రుణాల మంజూరు, వాటి వినియోగం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీల పూర్తి మార్గాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ అంశాలపై దర్యాప్తు పూర్తయితే మరికొన్ని కీలక అంశాలు బయటకు రావచ్చు.

డిజిటల్ ఆధారాలే కీలకం!

ఈ సోదాల్లో నగదు, ఆస్తులు మాత్రమే కాకుండా డిజిటల్ పరికరాలు, ఖాతాల పుస్తకాలు, స్థిర, చర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ డిజిటల్ డేటా, ఆర్థిక పత్రాల పరిశీలన ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.

ఎందుకంటే సోదాల ద్వారా సంబంధిత కంపెనీలు, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల స్థితిగతులకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించినట్లు ఈడీ స్వయంగా ప్రకటించింది. అంటే.. సెప్టెంబర్ 11న జరిగిన సోదాలతో ఒక దశ పూర్తయితే, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న డేటా, పత్రాల విశ్లేషణతో మరో దశ మొదలైనట్లే.

ఆ డేటాలో ఏం ఉంది? రూ.1,111 కోట్ల రుణాల డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎలాంటి కంపెనీల మధ్య లావాదేవీలు జరిగాయి? నిధుల మళ్లింపు జరిగిందా? రౌండ్ ట్రిప్పింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించాయా? అన్నది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

ఇంతకీ ఏఎంఆర్ కథ ఏంటి?

హైదరాబాద్ కేంద్రంగా ఎదిగిన AMR గ్రూప్‌కు మూడు దశాబ్దాలకు పైగా వ్యాపార చరిత్ర ఉంది. మైనింగ్, మైన్ డెవలప్‌మెంట్, కాంట్రాక్ట్ మైనింగ్, ఇరిగేషన్, రోడ్లు, సివిల్ కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ ప్రమోటర్లుగా మహేష్ రెడ్డి కుటుంబం ఉందని సంస్థ, రేటింగ్ ఏజెన్సీ వివరాలు పేర్కొంటున్నాయి.

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ AMR పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా మైనింగ్, సీనరేజ్ వసూళ్ల కాంట్రాక్టుల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. దీంతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ రంగాల్లోనూ సంస్థ విస్తరణ కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు AMRపై ఈడీ దర్యాప్తు దక్షిణాది వ్యాపార, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

ఇక ముందు ఏం జరుగుతుంది?

ఇప్పుడు ఈ కేసులో అసలు కీలకమైన దశ మొదలుకానుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, బ్యాంకింగ్ రికార్డులు, ఖాతాల పుస్తకాలు, ఆస్తుల పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆ పరిశీలనలో కొత్త లావాదేవీలు, కొత్త సంస్థలు లేదా కొత్త వ్యక్తుల పాత్రకు సంబంధించిన సమాచారం బయటపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

#AMR ED Raids#AMR Group#Enforcement Directorate#AMR News#ED Raids Hyderabad#Rs 6.35 Crore Assets#Rs 1111 Crore Loan#Money Laundering#AMRL Group#Hyderabad News#ED Investigation#Telugu News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి