తెలంగాణ

అత్యంత ప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం- మంత్రి శ్రీధర్ బాబు

రచన: NK9 నిమిషాల పఠనం

TG Assembly: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజాస్వామికంగా స్పీకర్ ప్రతి సభ్యునికి మాట్లాడేందుకు అవకాశం కల్పించారని ఆయన చప్పారు. శాసనసభ్యులు అందరూ సభలో చర్చలో పాల్గొన్నారని వెల్లడించారు. మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

TG Assembly: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన అసెంబ్లీ సమావేశాల్లో చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజాస్వామికంగా స్పీకర్ ప్రతి సభ్యునికి మాట్లాడేందుకు అవకాశం కల్పించారని ఆయన చప్పారు. శాసనసభ్యులు అందరూ సభలో చర్చలో పాల్గొన్నారని వెల్లడించారు. మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకుండా పోయారని విమర్శించారు.

సభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే స్పీకర్ సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా ప్రతిపక్ష సభ్యులు స్లోగన్స్ ఉన్న టీషర్టులు వేసుకుని వచ్చారని.. సభలో పోడియం వద్దకు వెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. స్పీకర్ అప్పీల్ చేసినప్పటికీ సభను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

అసెంబ్లీలో ఉండొద్దన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. నల్ల టీషర్ట్స్ పైన ఎలాంటి స్లోగన్స్ ఉండొద్దన్న నియమ నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. శాసన సభాపతి సభ నియమ నిబంధనలను అమలు చేశారని అన్నారు. అసెంబ్లీ నియమ నిబంధనలు అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రూల్స్ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీకి సంబంధించిన రూల్స్‌ను ఆ కమిటీనే రూపొందించిందన్నారు.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన మా అందరినీ బాధ పెట్టిందని శ్రీధర్ బాబు వాపోయారు.

ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగాయి, ఎన్ని గంటలు చర్చించారు, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి, ఏయే అంశాలపై ఎవరెవరు ఎంత సేపు మాట్లాడారు, ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయి అనే అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వివరాలు వెల్లడించారు.

8 రోజుల పాటు సభను జరుపుకున్నామని, 51 గంటల 52 నిమిషాల పాటు సభ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 50 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయన్నారు. 86 మంది సభ్యులు సప్లమెంటరీ ప్రశ్నలు అడిగారని.. 105 మంది సభ్యులు సభలో వివిధ అంశాలపైన మాట్లాడారని పేర్కొన్నారు.

ఇద్దరు మంత్రులు స్టేట్‌మెంట్లు ఇచ్చారని, నాలుగు బిల్లులను పాస్ చేసుకున్నామని వివరించారు. సభలో నాలుగు అంశాలపైన స్వల్పకాలిక చర్చ జరిగిందన్నారు. పలు బిల్లులను ఆమోదించుకున్నామన్నారు.

ఇక, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రతిపక్షం చేసిన రాద్ధాంతపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమగ్రంగా ప్రజలకు వివరణ ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, భవనాలు ఉన్న వాళ్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించారని తెలిపారు. సమస్యల పరిష్కారం పైన హైపవర్ ఆఫీషియల్ కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని పేర్కొననారు.

ఇక, ఎల్ నినో ప్రభావంపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో మాట్లాడారని.. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వారి అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తారని భావించాము.. సభకు రమ్మని వారికి విజ్ఞప్తి కూడా చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన ఎలా ఉందో అందరూ చూశారని చెప్పారు. పోలీసులు, మరీ ముఖ్యంగా మహిళా పోలీసులతో వారు ప్రవర్తించిన తీరు అంతా చూశారని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు క్షమాపణ చెప్తారని ఆశించాము, కానీ బీఆర్ఎస్ వాళ్లు క్షమాపణ చెప్పలేదన్నారు. స్పీకర్ మనస్తాపం చెందేలా బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన ఉందన్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం చెందినప్పటికీ సభను హుందాగా నడిపించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.

గౌరవప్రదమైన సభను మాక్ అసెంబ్లీ పెట్టి హాస్యాస్పదంగా చేశారని బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను మా విప్‌లు కోరారని మంత్రి తెలిపారు. అసెంబ్లీని కనీసం రెండు నెలలు జరపాలని మాట్లాడిన కేటీఆర్.. కనీసం తమపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరకపోవడం శోచనీయమన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలన్న చిత్తశుద్ధి కూడా వాళ్లకు లేదని విమర్శించారు. గత సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవర్తన ఇలాగే ఉంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది అని విమర్శించారు.

అత్యంత ప్రజాస్వామికంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతిపక్షాలు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అనేక విషయాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తే అధికార పక్ష సభ్యులు ధీటుగా స్పందించారని పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు.

ప్రజాస్వామిక వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. అసెంబ్లీ, శాసనమండలి నిర్వహణకు మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి 22-ఏ అంశం పై సభలో చర్చ చేపట్టిందని తెలిపారు. 22ఏ పై హైపవర్ అఫీషియల్ కమిటీ పరిశీలన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

22ఏ పై ప్రజలను అయోమయంలో ఉంచొద్దన్నదే తమ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ పరంగా భూ ఆరోపణలను పరిశీలించడానికి క్షేత్రస్థాయికి వెళ్లారని మంత్రి వెల్లడించారు. ఇక, దానం నాగేందర్ అనర్హత అంశంపైనా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. దానం నాగేందర్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదన్నారు. తీర్పు కాపీ అందాక దానిపై అధికారికంగా స్పందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

#Telangana Assembly Sessions#Telangana Assembly#Sridhar Babu#Brs#Congress#22A#Ktr#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి