Harish Rao: కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేసీఆర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు చిచ్చు రాజేశాయి. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. అసైన్డ్ భూముల కేటాయింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. వెలికట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను ఈ బృందం పరిశీలించింది. ఈ భూమి మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందినదిగా ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అంటున్నారు.. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరితే కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసీఆర్ దళితుల భూమిని కబ్జా చేశారని నిరూపిస్తే తామంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ నిరూపించకుంటే సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
''రైతుల దగ్గర భూములు కొన్నాం. కొలిచింది, హద్దులు నిర్ణయించింది మీ ప్రభుత్వమే. ఇందులో తప్పుందని అంటున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకవేళ తప్పు ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి. నేనేం కాదనడం లేదు. ఒక్క చిన్న తప్పు ఉన్నట్లు నిరూపించినా మొత్తం భూమి ప్రభుత్వానికి వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భూమిని ఫ్రీగా ప్రభుత్వానికి ఇచ్చేస్తా.
అందరూ కొన్నట్లే నేనూ వ్యవసాయ భూమి కొన్నా. అందులో ఫామ్ హౌస్ లు లేవు, స్విమ్మింగ్ పూల్స్ లేవు, విలాసమూ లేదు. ఇవాళ మా భూములు చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ బృందాన్ని ఒకటే అడగదలుచుకున్నా. మా నాయకుడు కేసీఆర్ దళితుల భూమి 300 ఎకరాలు కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారు. 300 ఎకరాలు కాదు 3 ఎకరాలు అయినా సరే.. దళితుల భూమి కేసీఆర్ కబ్జాలో లేదని తేలితే ముఖ్యమంత్రి రేవంత్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నిరూపిస్తే.. నేనూ, మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అని హరీశ్ రావు సవాల్ విసిరారు.








