Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిది దూకుడు రాజకీయం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీపై, పాలనపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇటీవల అసెంబ్లీలో గులాబీ పార్టీ పెద్దల భూముల వ్యవహారంపై సీఎం విసిరిన బాంబు ప్రకంపనలు సృష్టించింది. కానీ, ఈ యుద్ధంలో సీఎంకు సొంత కేబినెట్, ఎమ్మెల్యేల నుంచి దక్కిన మద్దతు చూస్తే.. "హస్తం గూట్లో రేవంత్ ఏకాకిగా మారుతున్నారా?" అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీలో రేవంత్ గర్జన..
ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని వందలాది ఎకరాల అసైన్డ్ భూముల అంశాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. ప్రత్యర్థి పార్టీ మూలాలను కదిలించేలా ఇంతటి భారీ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సాధారణంగా అధికార పక్ష మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విరుచుకుపడాలి. ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.
కానీ వాస్తవంలో ఏం జరిగింది?
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లైన్‌లో భాగంగా మాట్లాడగా, భూముల అంశం తన శాఖకు సైతం సంబంధించింది కావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే వాయిస్ వినిపించారు. సీనియర్ మంత్రులు అంతా వ్యూహాత్మక మౌనం పాటించారు. కనీసం ఒక ప్రెస్‌మీట్ పెట్టి సీఎం లేవనెత్తిన అంశాన్ని సమర్థించే ప్రయత్నం కూడా మెజారిటీ మంత్రుల నుంచి కనిపించలేదు.
శాసనసభలో సీఎంతో కలిసి బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
రేవంత్ కార్నర్ అవ్వాలనే వ్యూహమా?
మంత్రులు, ఎమ్మెల్యేల ఈ నిశ్శబ్దం వెనుక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు దాగి ఉన్నాయనే గుసగుసలు గాంధీ భవన్‌లో వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంతో నేరుగా తలపడే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ప్రజల్లో, మీడియాలో కార్నర్ కావాలని, తామెందుకు శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవాలన్న ఆలోచనలో కొందరు సీనియర్లు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడిని కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతలతో అవసరాలు ఉంటాయనో లేక వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయనో కొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారనే వాదన ఉంది.
రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తూ మొత్తం మైలేజ్‌ను తన ఖాతాలోనే వేసుకుంటున్నారని, ప్రభుత్వ నిర్ణయాల్లో తమ ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి కొందరు సీనియర్లలో అంతర్లీనంగా ఉందన్నది కాదనలేని నిజం.
ఒంటరి పోరాటం ఎంతవరకు సేఫ్?
ప్రభుత్వం మీదగానీ, సీఎం మీదగానీ విపక్షాలు దాడి చేసినప్పుడు కవచంలా నిలవాల్సిన సహచరులే ప్రేక్షకపాత్ర వహిస్తే అది పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతుంది. సామాన్య కార్యకర్తల్లో సైతం "రేవంత్ ఒక్కడే కొట్లాడుతున్నాడు.. మంత్రులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు" అనే భావన బలపడుతోంది.
పాలనలోనైనా, రాజకీయ యుద్ధంలోనైనా ఒక నాయకుడికి సొంత పార్టీ యంత్రాంగం దన్నుగా నిలవకపోతే సుదీర్ఘ పోరాటం కష్టతరమవుతుంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు "మనకెందుకులే" ధోరణిని వీడి సీఎంకు అండగా నిలుస్తారా? లేక రేవంత్ రెడ్డి ఈ వన్ మ్యాన్ ఆర్మీ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాల్సి వస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.









