National

West Bengal: బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నందిగ్రామ్ బైపోల్‎ నుంచి తప్పుకున్నTMC అభ్యర్థి!!..

రచన: Venu4 నిమిషాల పఠనం

టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు పార్టీ పేరు, జోడా ఫూల్ గుర్తు వినియోగంపై మధ్యంతర ఆంక్షలు విధించింది. మమతా బెనర్జీ, ప్రత్యర్థి వర్గాలు పార్టీపై హక్కు కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం మధ్యంతర నిర్ణయం తీసుకోగా.. మరోవైపు నందిగ్రామ్ బరిలో మమతా బెనర్జీ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన సంచితా ప్రధాన్ డే అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్ ఉప ఎన్నికకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇక తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకునే ముందు సంచితా ప్రధాన్ డే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె నిర్ణయానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా పూర్తిగా వెల్లడికాలేదు. సువేందు అధికారితో భేటీ అనంతరమే ఆమె పోటీ నుంచి తప్పుకోవడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థి తప్పుకోవడంతో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం ఎన్నికల బరిలో నుంచి వైదొలిగినట్టైంది. దీంతో మమతా కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి తమ వర్గం మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దేశ ప్రయోజనాలను, విపక్ష ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రెజినగర్ ఉప ఎన్నికపై మాత్రం తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసోంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు పార్టీ పేరు, జోడా ఫూల్ గుర్తు వినియోగంపై మధ్యంతర ఆంక్షలు విధించింది. మమతా బెనర్జీ, ప్రత్యర్థి వర్గాలు పార్టీపై హక్కు కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉప ఎన్నికల కోసం రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది.

ఈ నిర్ణయంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీపై రాజకీయ ఆరోపణలు చేస్తూ.. తన పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను వెనక్కి తగ్గబోనని, పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు, పేరు విషయంలోనూ, నందిగ్రామ్ అభ్యర్థి ఉపసంహరణ విషయంలోనూ వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో.. ఇప్పుడు బెంగాల్ ఉప ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది..

#West Bengal#politics#TMC candidate#withdraws#Nandigram by-election#sanchita-pradhan-dey#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి