Danam Nagender: తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దానం తెలిపారు. ఉప ఎన్నికకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు దానం చెప్పారు. ఎన్నికలు తనకు కొత్తేమీ కాదన్నారు. మళ్లీ పోరాడతా, మళ్లీ గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఏ పార్టీ తరపున బరిలోకి దిగతారు అనేదానిపై మాత్రం దానం నాగేందర్ క్లారిటీ ఇవ్వలేదు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన రోజు.. 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యేగా దానం అనర్హులని న్యాయస్థానం పేర్కొంది. 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీ ఫామ్‌తో పోటీ చేశారనే కారణంతో దానంపై అనర్హత వేటు పడింది.










