Erravalli Farmhouse: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల వ్యవహారంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఫాంహౌస్ లగ్జరీ అవసరాల కోసం ఏకంగా పేద దళితుల అసైన్డ్ భూములనే కబ్జా చేశారనే ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దళితుల కడుపు కొట్టి, వారి సాగు భూముల్లో ఓ భారీ చెరువునే నిర్మించారన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
2014 నాటి పంట పొలాలు.. 2023 నాటికి చెరువుగా ఎలా మారాయి?
డాక్యుమెంటరీ ఆధారంగా.. ఎర్రవల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 325లో ఉన్న భూములు 2014 కంటే ముందు నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన జీవనాధార వ్యవసాయ భూములు. ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు. అయితే అధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత, 2023 నాటికి అక్కడి ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని డాక్యుమెంటరీలో ఉంది. సర్వే నెంబర్ 325లోని దళితుల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని, ఆ స్థలంలో కేసీఆర్ తన ఫాంహౌస్ విస్తరణలో భాగంగా ఏకంగా ఒక చెరువును తవ్వించేశారనే విషయాన్ని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి దాకా పంటలు పండిన ఆ భూములు.. నేడు ఫాంహౌస్ పరిధిలోని నీటి కుంట కింద పూర్తిగా మునిగిపోయాయి.
కోనమ్మ చెరువు ఉండగా.. ఈ కొత్త చెరువు దేనికోసం?
వాస్తవానికి ఆ ప్రాంతంలోని దళితుల భూములకు, సాగు నీటి అవసరాలకు ఎప్పటి నుంచో ‘కోనమ్మ చెరువు’ అందుబాటులో ఉంది. అయినప్పటికీ, దళిత రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం తన ఫాంహౌస్ విలాసాలు, వ్యవసాయ అవసరాల కోసమే దళితుల అసైన్డ్ భూములు లాక్కుని ఈ కొత్త చెరువును నిర్మించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను ఇతరులు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటిది అధికార బలాన్ని ఉపయోగించి నిరుపేదల భూములను బలవంతంగా తీసుకొని చెరువు తవ్వడం వెనకున్న కబ్జా బాగోతం ఇప్పుడు ఆధారాలతో సహా బట్టబయలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎర్రవల్లి ఫాంహౌస్ విషయాన్ని బయటపెట్టినప్పటి నుంచి ఆక్రమణకు గురైన సర్వే నెంబర్ 325లోని అసైన్డ్ భూములను తిరిగి బాధితులైన దళితులకు అప్పగించాలనే డిమాండ్లు స్థానికుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.















