TG Politics: ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేయడం.. గెలిచాక అధికార పార్టీ పంచన చేరడం.. తెలంగాణ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సాధారణ అలవాటుగా మారిపోయింది. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ పార్టీలు మారినా తమకేమీ కాదనే ధీమాతో ఉండే నాయకులకు తాజాగా ఉన్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు చట్టం గుణపాఠం నేర్పగలదన్న బలమైన సంకేతాన్ని ఈ తీర్పు ఇచ్చినట్లు అయ్యింది.
దానం మెడకు చుట్టుకున్న ‘బి-ఫామ్’!
తాజాగా ఘటనలో దానం నాగేందర్ చేసిన అతిపెద్ద తప్పిదం ఆయన రాజకీయ భవిష్యత్తుకే గొడ్డలిపెట్టుగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడమే కాకుండా, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ ‘బి-ఫామ్’పై ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వేరే పార్టీ టికెట్‌పై అధికారికంగా ఎన్నికల బరిలోకి దిగడమే ఆయన పార్టీ మారారనడానికి తిరుగులేని న్యాయపరమైన సాక్ష్యంగా మారింది. కోర్టు ముందు ఎలాంటి సాకులూ నిలబడకుండా నేరుగా ఆయనపై అనర్హత వేటు పడటానికి ఇదే ప్రధాన కారణమైందని చెబుతున్నారు.
మిగిలిన ఎమ్మెల్యేలు సేఫా
దానం వ్యవహారం తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, తెల్లం వెంకట్రావు, డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య వంటి వారి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీరెవరూ కాంగ్రెస్ తరఫున ఎలాంటి అధికారిక పత్రాలు దాఖలు చేయకపోవడం వారికి కొంత రిలీఫ్ అని చెబుతున్నారు.
శాసనసభ రికార్డుల్లో ఇప్పటికీ వీరు బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారు. కాబట్టి దానం నాగేందర్ కేసుతో పోలిస్తే వీరిపై తక్షణమే వేటు పడే ముప్పు తక్కువే అని అంటున్నారు. అయినప్పటికీ, దానం ఉదంతం రాజకీయ వర్గాల్లో ఒక హెచ్చరిక గంటను మోగించిందనేది కాదనలేని నిజం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను లెక్కచేయకుండా గీత దాటితే న్యాయస్థానాలు ఉపేక్షించబోవని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ప్రజల తీర్పును ఇష్టా రీతిన అవమానిస్తూ పార్టీలు మారుతున్న నేతలు.. ఇకపై తమకేం కాదని అనుకోవడానికి కుదరదు. ఇప్పుడు దానంపై అనర్హత వేటు వేసినట్లే ఇకపై పార్టీలు మారితే చట్టపరమైన చర్యలు తప్పవనే సంకేతం కోర్టు స్పష్టంగా ఇచ్చినట్లు అయ్యిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.











