తెలంగాణ

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కి చెంపదెబ్బ- పాడి కౌశిక్ రెడ్డి

రచన: NK4 నిమిషాల పఠనం

Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపు అంశంలో ఈ మేరకు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపు అంశంలో ఈ మేరకు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కి చెంపదెబ్బ అని చెప్పారు.

అమ్ముడుపోతే అనర్హత తప్పదని మేము గతంలోనే చెప్పామన్నారు. మిగిలిన 8మందిపైనా అనర్హత వేటు పడే వరకు పోరాటం కొనసాగిస్తామని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ నిబంధనలను దానం ఉల్లంఘించారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు సమర్పించినా.. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్‌ ట్రైబ్యునల్‌ 2026 మార్చి 11న పిటిషన్లను తిరస్కరించిందని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం స్పీకర్‌ నిర్ణయంపై కీలక ఆదేశాలు ఇచ్చింది.

పార్టీ మారడమే కాకుండా వేరే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా స్పష్టం చేస్తూ దానంపై అనర్హత వేటు వేసింది కోర్టు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచే దానంపై అనర్హత వర్తిస్తుందని కోర్టు తెలిపింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ స్పీకర్, ఈసీకి కూడా తెలియజేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పరిణామం ఇతర ఫిరాయింపు నేతల్లోనూ తీవ్ర కలవరం రేపింది.

#Padi Kaushik Reddy#Telangana High Court#Brs#Disqualification#Congress#Danam Nagender#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి