హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో కలకలం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఒక నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం 50గజాల చిన్న విస్తీర్ణంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. భవనం పిల్లర్లు కుంగిపోయి, పక్కనే ఉన్న ఇతర ఇళ్లపైకి ఒరిగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయంతో బయటకు పరుగులు తీశారు.

భవనం ఏ క్షణంలోనైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండటంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు, పోలీసు బృందాలు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదకర భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని నివాసితులను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా రక్షణగా బారికేడ్లను ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
భవన నిర్మాణంపై నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో హైడ్రా (HYDRAA), టౌన్ ప్లానింగ్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒరిగిన భవనాన్ని సురక్షితంగా కూల్చివేసేందుకు యంత్రాలతో అధికారులు సమాయత్తమవుతున్నారు. గజాల పరిమితికి మించి అక్రమంగా నిర్మిస్తున్న ఇలాంటి భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బిల్డర్‌పై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గతనెల కిందట ఇదే ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనను మరువక ముందే మరో భవనం ఒరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. అతి తక్కువ విస్తీర్ణంలో నాలా పక్కన నిర్మించిన ఆ భవనం కూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భవనం శిథిలాలు ఆనుకుని ఉన్న ఇతర నివాసాలపై పడటంతో మరో ఇద్దరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త అందిన వెంటనే రెస్క్యూ బృందాలు (DRF, అగ్నిమాపక సిబ్బంది) రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశాయి. పరిమితికి మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోసారి ఇదే ఏరియాలో మరో భవనం ఒరిగిపోగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.









