తెలంగాణ

Vaishnavi Episode: యూట్యూబర్ వైష్ణవి ఉదంతం.. మనకు ఏం నేర్పుతోంది..?

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Vaishnavi Episode: ఒక నిండు ప్రాణం బలైపోయింది.. మరొకరి జీవితం కటకటాల పాలైంది.. ఇంకొకరి కుటుంబం నడిరోడ్డుపై నిస్సహాయంగా మిగిలిపోయింది.. యూట్యూబర్ వైష్ణవి విషాదాంతం, దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తోంది అనే ప్రశ్న తలెత్తక మానదు.

Vaishnavi Episode: ఒక నిండు ప్రాణం బలైపోయింది.. మరొకరి జీవితం కటకటాల పాలైంది.. ఇంకొకరి కుటుంబం నడిరోడ్డుపై నిస్సహాయంగా మిగిలిపోయింది.. యూట్యూబర్ వైష్ణవి విషాదాంతం, దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తోంది అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకరు కాదు.. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరు చేసిన తప్పిదాలే చివరకు ఈ తీవ్ర పరిణామాలకు దారితీసినట్లు కనిపిస్తుంది.

తొలి అడుగులోనే తప్పటడుగు

వైష్ణవి జీవితంలో తీసుకున్న మొదటి నిర్ణయమే ఆమె పాలిట శాపంగా మారినట్లు కనిపిస్తుంది. కన్నవారి అనుభవాన్ని, వారి ఆందోళనను పక్కనపెట్టి.. హరిబాబు ఎలాంటి వాడు, అతని నేపథ్యం ఏమిటి అనే కనీస ఆలోచన లేకుండా అతనిని పెళ్లి చేసుకోవడం ఆమె చేసిన పెద్ద పొరపాటు. వయసుతో వచ్చే ఆకర్షణను ప్రేమ అనుకుని, కుటుంబానికి దూరమై తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో ఆమె ఘటన మరోసారి నిరూపించింది. కన్నవారి మాట వినకపోతే జీవితం ఎంతటి అంధకారంలోకి నెట్టబడుతుందో చెప్పడానికి వైష్ణవి విషాదమే ఒక హెచ్చరిక.

కుటుంబ విద్వేషం, భర్త పైశాచికత్వం

హరిబాబు చేసిన నేరం క్షమించరానిది. తాళి కట్టిన భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి, కన్నతల్లి, అన్నల మాటలు నెత్తికెక్కించుకుని అదనపు కట్నం కోసం ఆమెను నిత్యం వేధించాడు. చివరికి ఆ వేధింపులు ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి దిగజారాయి. సొంత ఆలోచన లేకుండా ఇతరుల చెప్పుడు మాటలు విని, రక్తపు కూడు తిన్న హరిబాబు తన చేతులతో తానే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. భార్యను బలితీసుకుని సమాజం ముందు హంతకుడిగా నిలబడ్డాడు.

వ్యవస్థల జాప్యం.. బాధితుల ఆగ్రహం

ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి కేవలం ఐదు నెలల వ్యవధిలోనే బెయిల్ రావడం న్యాయ వ్యవస్థలోని లొసుగులను వేలెత్తి చూపుతోంది. నిందితుడు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే బాధితుల కుటుంబాల్లో న్యాయం జరగలేదన్న ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకోవడం సహజం. చట్టం తన పని చేయనప్పుడు, శిక్షలు ఆలస్యమైనప్పుడు ప్రజల్లో వ్యవస్థల మీద నమ్మకం సన్నగిల్లుతుంది. ఆ అసంతృప్తి నుంచే ప్రతీకార ఆలోచనలు పురుడుపోసుకుంటాయి.

ఆవేశం తెచ్చిన ముప్పు

సోషల్ మీడియాలో వచ్చిన సపోర్ట్, సానుభూతి చూసి సంతోష్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం మరో విషాదానికి కారణమైంది. ఆవేశంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాడికి పాల్పడటం ఎంతమాత్రం సమర్థించలేని తప్పు. ఇవాళ సంతోష్ జైలుపాలయ్యాడు.. కానీ అతనిపైనే ఆధారపడిన భార్య, ఇద్దరు కూతుర్ల భవిష్యత్తు ఏమిటి? ఆ పసిపిల్లల ఆలనాపాలనా ఎవరు చూస్తారు? న్యాయం కోసం పోరాడాల్సింది పోయి, ప్రతీకారం పేరుతో అనాలోచితంగా అడుగు వేసి తన కుటుంబాన్ని అవస్థల్లోకి నెట్టాడు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు నిజ జీవిత సమస్యలను పరిష్కరించలేవని, చట్టాన్ని అతిక్రమిస్తే మిగిలేది కన్నీళ్లేనని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఈ ఉదంతం మనకు నేర్పుతున్న పాఠం ఇదే..

వైష్ణవి ఘటన మన సమాజానికి ఒక పెద్ద గుణపాఠం. తల్లిదండ్రుల మాటను కాదని గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటే వైష్ణవిలా బలైపోవాల్సి వస్తుంది. ఇతరుల మాటలు విని భార్యను వేధించి, అమానుషంగా ప్రవర్తిస్తే హరిబాబులా జీవితం నాశనమవుతుంది. ఆవేశంలో విచక్షణ కోల్పోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సంతోష్‌లా కుటుంబం నడిరోడ్డున పడుతుంది. ఆవేశం, మొండితనం, స్వార్థం మనుషులను ఎక్కడికి చేరుస్తాయో ఈ వరుస ఘటనలు కళ్లకు కట్టాయి. ఇప్పటికైనా యువత, సమాజం ఆలోచించాలి.. ఇంకెవరూ ఇలాంటి తప్పిదాలు చేసి జీవితాలను నాశనం చేసుకోకూడదు. విచక్షణ, చట్టంపై గౌరవం, కుటుంబ విలువల ప్రాధాన్యతను గుర్తించకపోతే ఇలాంటి విషాదాలు మళ్లీమళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి.

#Vaishnavi Episode#YouTuber Vaishnavi#Vaishnavi Case#Vaishnavi Death Case#Haribabu Case#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి