TG Politics: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించి ఈ నిర్ణయం తీసుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పార్టీ మారడమే కాకుండా వేరే పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా స్పష్టం చేస్తూ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇతర ఫిరాయింపు నేతల్లోనూ ఈ పరిణామం తీవ్ర కలవరం రేపుతోంది.










