KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానంపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దానంపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా పరిగణించాలని స్పష్టం చేసింది.
దానంపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ప్రకటించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలను దానం ఉల్లంఘించారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు సమర్పించినా.. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ 2026 మార్చి 11న పిటిషన్లను తిరస్కరించిందని వారు పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పీకర్ నిర్ణయంపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
పార్టీ మారడమే కాకుండా వేరే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా స్పష్టం చేస్తూ దానంపై అనర్హత వేటు వేసింది కోర్టు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచే దానంపై అనర్హత వర్తిస్తుందని కోర్టు తెలిపింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ స్పీకర్, ఈసీకి కూడా తెలియజేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పరిణామం ఇతర ఫిరాయింపు నేతల్లోనూ తీవ్ర కలవరం రేపింది.











