తెలంగాణ

Telangana Congress: కొత్త ఇన్‌ఛార్జ్ వస్తే మొదటికే మోసం వస్తుందా? కాంగ్రెస్ నేతల్లో మొదలైన వణుకు!

రచన: Mahesh4 నిమిషాల పఠనం

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మళ్లీ ఆశల పల్లకి ఊగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో అత్యవసరంగా భేటీ కావడంతో గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మళ్లీ ఆశల పల్లకి ఊగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో అత్యవసరంగా భేటీ కావడంతో గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కార్యకర్తలకు దక్కని నామినేటెడ్ పదవుల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి రానుందా? లేక ప్రతిసారీ చెప్పే ‘వాయిదాల పంచాంగం’ మళ్లీ తెరపైకి వస్తుందా? అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.

అయితే, ఈ సడన్ ఢిల్లీ టూర్ వెనుక ఓ కీలక పరిణామం దాగి ఉందన్నది గాంధీ భవన్ వర్గాల టాక్. ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోనే సుదీర్ఘ కాలం పాటు విదేశాలకు వెళ్లనున్నారు. ఆమె వెళ్లేలోపే ఈ జాబితాలను ఆమోదింపజేయకపోతే.. ఒకవేళ రాష్ట్రానికి కొత్త ఇన్‌ఛార్జ్ వస్తే మొత్తం కసరత్తు మళ్లీ మొదటికే వస్తుందన్న భయంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

పదవుల పంపకంలో అసహనం

మీనాక్షి నటరాజన్ అందుబాటులో ఉన్నప్పుడే క్లియరెన్స్ తెచ్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడిది తేలకపోతే మరో ఇన్‌ఛార్జ్ రాక, మళ్లీ సమీక్షల పేరిట పదవుల భర్తీ ఎడతెగని కథలా మారుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో నియమించిన 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది.

వీరిలో కేవలం ఐదారుగురికి మాత్రమే రెన్యూవల్ అవకాశం ఉండగా, మిగిలిన పోస్టులతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ స్థానాల కోసం వేల సంఖ్యలో నేతలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్ పోస్టులే కాకుండా, పీసీసీ కార్యవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అధికారంలో ఉన్నప్పటికీ పదవుల కోసం హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడంపై ద్వితీయ శ్రేణి నేతల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది.

మహేష్ గౌడ్ చేతిలోని ప్రతిపాదనలకు అధిష్టానం వెంటనే పచ్చజెండా ఊపుతుందా? లేక ఆశావహులకు మళ్లీ నిరీక్షణే మిగులుతుందా? అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారైనా పంచాయితీ తెగి లిస్టు బయటకు వస్తుందో, లేదంటే మళ్లీ కథ మొదటికే వస్తుందో చూడాలి.

#Telangana Congress#Telangana Politics#Mahesh Kumar Goud#Meenakshi Natarajan#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి