Venkatesh-Trivikram: సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సీనియర్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ (AK47). వెంకీ-గురూజీల కాంబో అంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దాదాపు షూటింగ్ చివరి దశకి చేరుకుంది. దీంతో, ఓ స్పెషల్ నంబర్ ని ప్లాన్ చేశారట. ఈ సాంగ్‌లో నివేతా, డింపుల్ కనిపించబోతున్నటుగా సమాచారం.
ఇక, షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ అక్టోబర్ 2న భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా ఆదర్శ కుటుంబం చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకీ సరసన ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు కలిసి ఆడిపాడనున్నారట. అదిరిపోయే మాస్ స్టెప్పులతో ఊపేయనున్నారట. ఇందులో, హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కథలో ప్రధానంగా వచ్చే కీలక సన్నివేశాలు, ప్రత్యేక పాత్రల కోసం నివేదా పేతురాజ్, డింపుల్ హయాతిలను కూడా తీసుకున్నారు. వీరిది కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాదట. వెంకీతో వీరిద్దరి కాంబినేషన్‌లో హీటు పుట్టించే పాటను దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పాట హైదరాబాద్‌లో గల ఓ ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన కలర్‌ఫుల్ సెట్‌లో షూటింగ్ జరుగుతోందట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మాస్ బీట్స్‌కు వెంకీ మార్క్ ఎనర్జీ, ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం. ఇక, ఇప్పటికే ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బాగానే అంచనాలు పెంచేసింది.










