Shashwat Sachdev: సుకుమార్ మొదటి సారి సంగీత దర్శకుడి విషయంలో వైల్డ్ డెసిషన్ తీసుకోబోతున్నాడా? ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది. దీనికి, కారణాలు ఏంటనేవి స్పష్టంగా తెలియదు గానీ, కెరీర్ ప్రారంభం నుంచి ఉన్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ను పక్కన పెట్టి 'ధురంధర్' ఫేమ్ శాస్వత్ సచ్‌దేవ్‌ని తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తాజా సమాచారం. ఇదే, నిజమైతే..టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఠఫ్ కాంపిటీషన్ ఖాయం.
ధురంధర్ సినిమా మ్యూజిక్ పరంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఏ స్థాయిలో ఆకట్టున్నాడో శాస్వత్ సచ్‌దేవ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధురంధర్ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సింది కూడా ఆయనకే. ఒక సినిమా మ్యూజిక్ వల్ల ఎంతగా జనాలను ఆకట్టుకుంటుందో చెప్పడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన ధురంధర్ సినిమా పెద్ద ఎగ్జాంపుల్. అందుకే, ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దసరాకి మొదలు కాబోతున్న RC17 కి మ్యూజిక్ డైరెక్టర్‌గా శాస్వత్ సచ్‌దేవ్ ఫిక్సైయ్యాడట. వాస్తవానికి, నిన్నా మొన్నటి వరకూ దేవి శ్రీ ప్రసాద్ కాకుండా ఇటీవల మన టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ని సుకుమార్ ఓకే చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు..దేవి, అనిరుధ్ కాకుండా సుకుమార్ చూపు ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ మీద నిలిచిందట.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో RC17 చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇక, ఈ సినిమా కథ గుర్రం పందాల నేపథ్యంలో సాగుతుందట. అందుకే, ఇటీవల ఓ పోస్టర్ కూడా ఆ సింబల్‌తో వదిలారు. సుకుమార్-చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మళ్ళీ, ఇన్నేళ్ళకి వీరి కాంబోలో పాన్ ఇండియా సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. పుష్ప సిరీస్‌తో సుకుమార్ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.












