తెలంగాణ

KTR: రేవంత్‌.. మా భూములన్నీ రాసిస్తాం.. పేదల అకౌంట్లలో లక్ష కోట్లు వేస్తావా : కేటీఆర్

రచన: Mahesh5 నిమిషాల పఠనం

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన భూములున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

KTR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష కోట్ల విలువైన భూములున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ చేసిన ఆరోపణలను తుత్తునియలు చేస్తూ.. కనీవినీ ఎరుగని రీతిలో నేరుగా సీఎంకే బహిరంగ సవాల్ విసిరారు.

ప్రతి ఇంచు భూమి రాసిస్తాం..

"మా కుటుంబానికి లక్ష కోట్ల భూములున్నాయంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంలో ఒక్కశాతం కూడా వాస్తవం లేదు. అయినప్పటికీ నీకో ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. మాకున్న ప్రతి ఇంచు ఆస్తిని రాసివ్వడానికి మేము సిద్ధం. మరి తెలంగాణలోని నిరుపేదల ఖాతాల్లో నువ్వు వెంటనే రూ.లక్ష కోట్లు జమ చేస్తావా? దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించు. అలా చేయలేకపోతే తప్పుడు ప్రచారం ఆపి, ముక్కు నేలకు రాసి నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పు" అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ అంటూ చేసిన అసత్య ప్రచారం బెడిసికొట్టడంతోనే, ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ సరికొత్త నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం కేవలం 67 ఎకరాలు మాత్రమేనని ఒప్పుకున్న రేవంత్.. ఇప్పుడు మళ్లీ కట్టుకథలు అల్లడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కుతంత్రాలు

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన 420 హామీల అమలులో మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు, యూరియా కొరత, సాగునీటి కష్టాలతో అల్లాడుతుంటే.. నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాన ప్రతిపక్షంపై అడ్డగోలుగా బురదజల్లుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ గతంలో ఎన్నికల వేళ గగ్గోలు పెట్టి, ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.

22ఏ వెనుకే అసలు కుంభకోణం..

రేవంత్ సర్కార్ 22ఏ నిబంధన కింద ఏకంగా కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుకే అసలైన లక్ష కోట్ల ల్యాండ్ స్కామ్ దాగి ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. పరిపాలన చేతకాక కేవలం దందాలు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో నెట్టుకొస్తున్నారని విరుచుకుపడ్డారు. త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కాంగ్రెస్ పెద్దలు సాగించిన దోపిడీపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి, ప్రజల సొమ్మును పైసాతో సహా కక్కిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనికి సీఎం ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#KTR#KT Rama Rao#Revanth Reddy#Telangana Politics#BRS#BRS Working President#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి