మధ్యతరగతి జీవితం ఎప్పుడూ ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడే ఒక నిరంతర పోరాటం. వచ్చే చిన్నపాటి జీతంతోనే కష్టపడి చక్కటి జీవితాన్ని నిర్మించుకోవాలని, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడతాడు.. కానీ, రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర ధరలు, నిలకడలేని వైద్య, విద్య ఖర్చులు వారి ఆశలపై నీళ్లు చల్లుతాయి. సంపాదన పరిమితం... ఖర్చులు అపరిమితం!..
నెల చివరకు వచ్చేసరికి భయం, కుటుంబ యజమానికి కునుకు కూడా లేకుండా చేస్తుంది. ఆశలకు, బాధ్యతలకు నడుమ సాగే ఈ సర్కస్ ఫీట్ మధ్యతరగతి జీవితానికి శాపమే.. ఇక ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. పరిస్థితులకు కారణాలు ఏమైతేనేమి.. అదుపు లేకుండా ఉన్న ధరల పెరుగుదల ఇప్పుడు మార్కెట్‌కే పరిమితం కాలేదు.. సామాన్యుడి ఇంటి బడ్జెట్ నుంచి హోటల్ ప్లేట్ వరకు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
సెప్టెంబరు రెండోవారం ముగిసినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటం వంటి పరిణామాలు నిత్యావసరాల ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా కూరగాయల మార్కెట్ నుంచి టీస్టాల్ వరకు.. టిఫిన్ సెంటర్ నుంచి భోజన హోటల్ వరకు ధరల మంట కనిపిస్తోంది. ఇటీవల ఉల్లి ధరలు కూడా సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.80 వరకు పలుకుతుండటంతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బిర్యానీ హోటళ్లలో ఉల్లి వడ్డింపు తగ్గింది.
మరికొన్ని చోట్ల అడిగితేనే అరకొరగా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టిఫిన్ సెంటర్లలో ఉల్లి దోశను మెనూ నుంచి తొలగించిన చోట్లూ కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు భోజనంలో సహజంగా కనిపించే ఉల్లి కూడా ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఇక వంటనూనె ధరలు కూడా హోటళ్ల వ్యయాన్ని పెంచుతున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.180 వరకు చేరడంతో పూరీ, వడ వంటి అల్పాహారాల ధరలు కొన్ని చోట్ల రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగాయి.
మరోవైపు బియ్యం ధర కూడా హోటళ్లపై అదనపు భారాన్ని మోపుతోంది. 25 కిలోల బియ్యం బస్తా మూడు నెలల క్రితం సుమారు రూ.1200 ఉండగా.. ఇప్పుడు రూ.1600కు పైగా చేరిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ప్లేట్ మీల్స్ రూ.80 నుంచి రూ.90కి, ఫుల్ మీల్స్ రూ.120 నుంచి రూ.140కి పెరిగిన హోటళ్లు ఉన్నాయి. ఒకవైపు కుటుంబం ఆదాయం పెద్దగా పెరగకపోయినా.. ఆహారం, ప్రయాణం, వైద్యం, విద్య, ఇల్లు వంటి ఖర్చులు మాత్రం ఒక్కొక్కటిగా పెరుగుతుంటే నెలాఖరుకు మిగిలేది ఏంటి అన్నదే సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
బయట టిఫిన్ చేయాలన్నా.. టీ తాగాలన్నా.. కుటుంబంతో భోజనం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరవైపు పంచదార ధర పెరుగుదల కూడా టీస్టాళ్లను ప్రభావితం చేస్తోంది. కిలో పంచదార గత నెల వరకు రూ.35 ఉండేది. ప్రస్తుతం రూ.70కు చేరింది. ఈ ప్రభావం టీస్టాళ్లపై పడింది. సింగిల్ టీ రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. ఇలా చిన్న మొత్తాలుగా కనిపించే పెరుగుదలే నెల మొత్తం లెక్కలో కుటుంబ బడ్జెట్‌పై గణనీయమైన భారంగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల ముందున్న సవాలు- ధరలను నియంత్రించడం. సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం, కృత్రిమ కొరత లేకుండా అక్రమ నిల్వలను అరికట్టడం, రైతులకు అవసరమైన సమయంలో మద్దతు కల్పించడం, మార్కెట్‌లో ధరలపై నిరంతర నిఘా పెట్టడం వంటి చర్యలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, వర్షాభావ పరిస్థితులు లేదా సరఫరాలో అంతరాయాలు వచ్చినప్పుడు ధరలు మరింత పెరగకుండా ముందస్తు చర్యలు అవసరం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
లేకపోతే ఒక వస్తువు తర్వాత మరో వస్తువు ధర పెరుగుతూ.. చివరకు సామాన్యుడి ఆదాయంలో ఎక్కువ భాగం కనీస అవసరాలకే ఖర్చయ్యే పరిస్థితి రావచ్చు. ఇక ధరల పెరుగుదల కుటుంబ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం. కాబట్టి మార్కెట్ ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టడం.. సామాన్యుడి జీవన భారాన్ని తగ్గించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది..










