అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ (H-1B) వీసాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కేటగిరీల హెచ్-1బీ దరఖాస్తులకు విధించిన 1లక్ష డాలర్ల (సుమారు రూ.84 లక్షలు) భారీ రుసుమును మరికొంత కాలం కొనసాగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికితోడు హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయా లేదా అనే అంశంపై కఠినమైన నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా వైట్‌హౌస్ ఈ చర్యలు చేపట్టింది.
కొత్త నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ ఉద్యోగులు చేసే విధులకు సరిసమానమైన పనులు చేసే అమెరికన్ కార్మికులను సదరు సంస్థ ఇటీవల లేఆఫ్స్ ద్వారా తొలగించిందా, లేదా భవిష్యత్తులో ఉద్యోగాల్లో కోతలు విధిస్తుందా అనే విషయాన్ని విదేశాంగ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు సమగ్రంగా పరిశీలిస్తాయి. లేఆఫ్స్ చేసినంత మాత్రాన దరఖాస్తును నేరుగా తిరస్కరించకపోయినా, వీసా మంజూరు నిర్ణయంలో ఈ అంశాన్ని అత్యంత కీలకమైన అంశంగా పరిగణనలోకి తీసుకోనున్నారు.
మరోవైపు ఇప్పటికే దాఖలైన లేబర్ కండిషన్ అప్లికేషన్లను (LCA) రాబోయే 30 రోజుల్లోగా సమీక్షించాలని అమెరికా కార్మిక శాఖను ఆదేశించారు. ఈ సమీక్షలో కంపెనీలు వేతనాలు, ఉద్యోగ నిబంధనలలో ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే సదరు సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు. వైట్‌హౌస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ కఠిన విధానాల వల్ల ఇప్పటికే ప్రధాన ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు 92 శాతం, కాన్సులర్ ప్రాసెసింగ్ అభ్యర్థనలు 97శాతం మేర భారీగా పడిపోయాయి.
ఈ కఠినమైన విధానాలు భారతీయ ఐటీ నిపుణులకు, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కోలుకోలేని దెబ్బగా మారనున్నాయి. అధిక వీసా ఫీజులు, కఠినమైన తనిఖీల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులను స్పాన్సర్ చేయడానికి వెనుకంజ వేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.












