హైకోర్టు తీర్పుతో ఖాళీ అయిన ఖైరతాబాద్ సీటు..
ఎన్నికలకు రెడీ అంటున్న దానం
షెడ్యూల్ ఎప్పుడు..?
ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా?
ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక దాదాపు ఖాయమైనట్టేనా..? తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతకు గురయ్యారు. అంతేకాదు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టంగా ప్రకటించింది. తీర్పు కాపీని అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని కూడా ఆదేశించింది. దీంతో ఖైరతాబాద్‌లో మళ్లీ ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైన పరిణామంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే ఒక కీలక ప్రశ్న ఉంది. ఉప ఎన్నిక ఖాయమైతే.. అది ఎప్పుడు?
అక్టోబర్ 6న కొన్ని సీట్లకు ఉప ఎన్నిక...
దేశంలో ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మదురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచావడి, పశ్చిమ బెంగాల్‌లో రేజీనగర్, నందిగ్రామ్ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ వచ్చింది, సెప్టెంబర్ 16న నామినేషన్ల గడువు ముగిసింది, సెప్టెంబర్ 19న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతోంది. అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న కౌంటింగ్ జరగనుంది.
అందుకే ఖైరతాబాద్‌ను అక్టోబర్ 6 ఉప ఎన్నికలతో కలిపే అవకాశం లేదు. ప్రధాన కారణం చాలా సింపుల్.. టైమ్ లేదు. ఖైరతాబాద్‌పై హైకోర్టు తీర్పు వచ్చింది సెప్టెంబర్ 18న. అప్పటికే అక్టోబర్ 6 ఉప ఎన్నికల ప్రక్రియ నామినేషన్ దశను దాటి, ఉపసంహరణ దశకు చేరుకుంది. కాబట్టి ఇప్పుడు ఖైరతాబాద్‌ను ఆ షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
మరి ఖైరతాబాద్‌లో ఎన్నిక ఎప్పుడు?
ఇక్కడే అసలు ఆసక్తి. హైకోర్టు తీర్పు ప్రకారం దానం నాగేందర్ అనర్హతకు గురయ్యారు. ఖైరతాబాద్ సీటు ఖాళీగా ఉందని కూడా కోర్టు ప్రకటించింది. అంటే ఎన్నికకు అవసరమైన కీలక అడుగు పడింది. ఇప్పుడు తదుపరి ప్రక్రియ ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లాలి. కోర్టు తీర్పును అసెంబ్లీ, స్పీకర్, ఈసీకి కమ్యూనికేట్ చేయాలని ఆదేశించడంతో.. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అధికారిక ప్రక్రియ మొదలయ్యే మార్గం ఏర్పడింది.
అయితే తీర్పు వచ్చింది కాబట్టి వెంటనే ఎన్నికల తేదీ వచ్చేస్తుందని కాదు. ఎన్నికల సంఘం ఖాళీని అధికారికంగా పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. ఆ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ లోగా మరెక్కడైనా ఉప ఎన్నికలు ఉన్నాయా అనేది కూడా కీలకమే.
ఇక చట్టపరంగా చూస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151A ప్రకారం, సాధారణంగా ఒక అసెంబ్లీ సీటు ఖాళీ అయితే ఆ ఖాళీ ఏర్పడిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. అయితే సభ మిగిలిన పదవీకాలం ఏడాదికంటే తక్కువగా ఉంటే లేదా ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధ్రువీకరిస్తే మినహాయింపు ఉంటుంది.
కాబట్టి ఖైరతాబాద్ విషయంలో ఎన్నిక ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇప్పుడే ఒక తేదీ చెప్పడం సాధ్యం కాదు. కానీ సాధారణ నిబంధన ప్రకారం.. ఖాళీ ఏర్పడిన తర్వాత 6 నెలల వ్యవధిలోనే ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది, మినహాయింపులు తప్ప. అంటే అక్టోబర్ 6 కాకపోతే.. 2026 చివరి నెలల్లో లేదా 2027 ప్రారంభంలో జరిగే మరో ఉప ఎన్నికల దశలో ఖైరతాబాద్ కూడా చేరే అవకాశం ఉంది.
న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా?
ఈ విషయంలోనే అసలు క్లారిటీ అవసరం. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు తీర్పు అమలును కొంతకాలం నిలిపివేయాలని కోరారు. కానీ హైకోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. ఖైరతాబాద్ సీటు ఖాళీగా ఉందని కోర్టు స్పష్టం చేసింది.
అయితే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించే న్యాయపరమైన అవకాశం మాత్రం ఉంది. కానీ దానం దీనికి ససేమిరా అంటున్నారు. తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల్లోకి వెళ్లి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాననే ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇదే ఖైరతాబాద్ బైపోల్‌కు ఇప్పుడు కీలకమైన పాయింట్.
అయితే భవిష్యత్తులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించరని ఇప్పుడే చెప్పలేం. ఆయన ప్రస్తుతం చెప్పిన వైఖరి ఎన్నికల వైపే ఉంది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు నుంచి స్టే వస్తే మాత్రం మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
రాజకీయ లెక్కలు మొదలు!
ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేకపోయినా.. ఖైరతాబాద్‌లో రాజకీయ లెక్కలు మాత్రం మొదలయ్యే అవకాశం ఉంది. 2023లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ సీటు రాజకీయంగా మారిపోయింది. ఇప్పుడు అదే వ్యవహారం చివరకు ఉప ఎన్నికకు దారి తీసింది.
కాంగ్రెస్‌కు ఇది అధికారంలో ఉన్న పార్టీగా మరో పరీక్ష. బీఆర్ఎస్‌కు తమ నుంచి వెళ్లిపోయిన సీటును తిరిగి సాధించుకునే అవకాశం. బీజేపీకి హైదరాబాద్‌లో తన రాజకీయ బలాన్ని మరోసారి పరీక్షించుకునే వేదిక. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయమే ఉండడంతో.. ఈ బైపోల్ పై అన్ని పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టే పరిస్థితైతే స్పష్టంగా కనిపిస్తోంది.












