ఉత్తర కొరియా తమ సైనిక, ఆయుధ సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు వేగవంతం చేసింది. తమ దేశ ఫిరంగి దళాలు(ఆర్టిలరీ) ప్రపంచంలోనే అత్యంత కేంద్రీకృత, అత్యంత విధ్వంసకర శక్తిగా రూపాంతరం చెందాలని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. వారం రోజులుగా పలు ప్రధాన ఆయుధ తయారీ కర్మాగారాలను, క్షిపణి ఉత్పాదక కేంద్రాలను సందర్శించిన కిమ్, ఈ సందర్బంగా ఆర్మీ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ (KCNA) వెల్లడించింది.
యుద్ధాన్ని నిరోధించడం, అనివార్యమైతే ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడమే తమ దళాల ప్రాథమిక లక్ష్యమని కిమ్ స్పష్టం చేశారు. ఆధునిక సైనిక సాంకేతికతకు అనుగుణంగా ఆయుధాల తయారీలో కృత్రిమ మేధ(AI) వాడకాన్ని, పూర్తిస్థాయి ఆటోమేషన్‌ను విరివిగా తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా 600 ఎంఎం, 240 ఎంఎం మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, ఆత్మాహుతి డ్రోన్లతో పాటు బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి వేగాన్ని మరింత పెంచాలని ఆయన తయారీదారులకు మార్గదర్శనం చేశారు.
దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన త్రైపాక్షిక సైనిక విన్యాసాలకు సమాధానంగానే ఉత్తర కొరియా ఈ ఆయుధ ప్రదర్శనలు, క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. సెప్టెంబరు 14న కొత్త రకం అటాక్ డ్రోన్లు, టాక్టికల్ క్రూయిజ్ మిస్సైళ్లతో ప్రయోగాత్మక ఫైర్‌పవర్ విన్యాసాలు నిర్వహించిన ఉత్తర కొరియా, అవన్నీ 100శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీగా అవతరించడమే తమ పార్టీ ప్రధాన వ్యూహమని కిమ్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగానే, శనివారం ఉదయం వోన్సాన్ తీర ప్రాంతం నుంచి ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపునకు అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ గుర్తించారు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, కిమ్ హెచ్చరికలు, వరుస మిస్సైల్ ప్రయోగాలు అంతర్జాతీయ సమాజంలో, ముఖ్యంగా పొరుగు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.











